నవతరం కథానాయకుల్లో వచ్చీ రాగానే సందడి చేసిన హీరో విశ్వక్ సేన్ అనే చెప్పాలి. రెండు సినిమాల్లో నటించాడో లేదో, మూడో చిత్రానికే మెగాఫోన్ పట్టేసి డైరెక్టర్ అయిపోయాడు విశ్వక్ సేన్. తన సినిమాల టైటిల్స్ విషయంలోనూ వైవిధ్యం చూపిస్తూ సాగుతున్నాడు విశ్వక్.
విశ్వక్ సేన్ అసలు పేరు దినేశ్ నాయుడు. 1995 మార్చి 29న జన్మించాడు. ఆయన తండ్రి కరాటే రాజు అని పేరున్న మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. చిన్నతనం నుంచీ తనయుడిలోని సినిమా అభిలాష గమనించిన తండ్రి ప్రోత్సహించారు. కానీ, దినేశ్ నాయుడు అన్న పేరు అచ్చి రాదని సంఖ్యాశాస్త్రం ప్రకారం ‘విశ్వక్ సేన్’గా పేరు మార్చారు. దాంతోనే విశ్వక్ లక్ మారింది. దిల్ రాజు నిర్మించిన ‘వెళ్ళిపోమాకే’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు విశ్వక్. చూపరులకు జూనియర్ యన్టీఆర్ లా కనిపించాడు. దాంతో విశ్వక్ మరో తారక్ అనిపించుకున్నాడు. తరువాత డి.సురేశ్ బాబు నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది?’లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు విశ్వక్. తండ్రి కరాటే రాజు నిర్మించిన ‘ఫలక్ నుమా దాస్’ చిత్రంలో హీరోగా వేషం కడుతూనే, దర్శకత్వం కూడా చేపట్టాడు. ఆ పై హీరో నాని నిర్మించిన ‘హిట్’లో పోలీస్ అధికారిగా నటించి ఆకట్టుకున్నాడు. ఐదో చిత్రం ‘పాగల్’లోనూ హుషారుగా సాగాడు విశ్వక్.
ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తోన్న ఐదు చిత్రాలు ముస్తాబవుతున్నాయి. వీటిలో ముందుగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ రానుంది. ‘గామి’, ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’, ‘ఓరి దేవుడా…’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. మరి ఈ సినిమాలతో ఏ తీరున విశ్వక్ సేన్ సందడి చేస్తాడో చూడాలి.