వరుణ్ తేజ్, సాయీ మంజ్రేకర్ జంటగా నటించిన ‘గని’ సినిమా శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘స్వతహాగా యాక్షన్ మూవీస్ అంటే తనకు ఇష్టమని, తాను కూడా యాక్షన్ హీరో కావాలనే చిత్రసీమలోకి అడుగుపెట్టానని, అయితే ప్రేమకథా చిత్రాలే వరుసగా సక్సెస్ కావడంతో యాక్షన్ చిత్రాలు చేయలేకపోయానని, మనసులోని కోరికను నెరవేర్చుకోవడానికే ‘గని’ మూవీ చేశానని, త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ప్రవీణ్ సత్తారు సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రమేన’ని వరుణ్ తేజ్ చెప్పాడు.
‘గని’ సినిమా ప్రారంభ విశేషాల గురించి మాట్లాడుతూ, ”శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ‘మిస్టర్’ మూవీ సమయంలో కో-డెరెక్టర్ కిరణ్ కొర్రపాటి పరిచయం అయ్యాడు. అతని ఆలోచనా విధానంతో బాగా కనెక్ట్ అయ్యాను. దాంతో ‘తొలిప్రేమ’కు అతని లాంటి సీనియర్ కో-డైరెక్టర్ అవసరమని తీసుకున్నాను. ఆ సినిమా చేస్తున్నప్పుడే కిరణ్ ను దర్శకుడిగా పరిచయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. అతను కొన్ని కథలు చెప్పినా, వాటిని కాదని స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేద్దామని అన్నాను. అది ‘గని’గా రూపుదిద్దుకుంది. కిరణ్ తో పాటు నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధుకు ఇదే మొదటి సినిమా కావడంతో నేను కాస్తంత ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను” అని అన్నారు. బాక్సింగ్ నేపథ్యంలో సినిమా వచ్చి చాలా కాలం కావడంతో దాన్ని ఎంచుకున్నామని, అయితే బరిలోకి దిగిన తర్వాత అది ఎంత కష్టమో అర్థమైందని వరుణ్ తేజ్ చెప్పాడు. యు.ఎస్.లో రెండు నెలల పాటు ఒలింపిక్ విజేత టోని దగ్గర, ఆ తర్వాత ఇండియాలో నీరజ్ దగ్గర శిక్షణ తీసుకున్నట్టు తెలిపాడు. పాన్ ఇండియా కాన్సెప్ట్ ను దృష్టిలో పెట్టుకుని కాకుండా పాత్రలకు అనుగుణంగానే పరభాషా తారలను తీసుకున్నట్టు వరుణ్ తేజ్ చెప్పాడు. ఇందులో హీరోకు ఉత్తరాది నుండి వచ్చిన వ్యక్తి కోచ్ గా ఉంటాడని ఆ పాత్రకు సునీల్ శెట్టిని తీసుకున్నామని, ఉపేంద్రను దృష్టిలో పెట్టుకునే కిరణ్ ఆ పాత్రను రాయడంతో ఆయన్నే ఎంపిక చేసుకున్నామని, హీరోయిన్ గా ఎంతోమందిని వెతికిన తర్వాత చివరకు సాయీ మంజ్రేకర్ ను సెలక్ట్ చేశామని అన్నారు. మొత్తం ఆరు పాత్రల మధ్య కథంతా జరుగుతుందని చెప్పారు. ఆ మధ్య హిందీలో వచ్చిన ‘తుఫాన్’కు భిన్నంగా ఈ సినిమా ఉండదని అన్నారు. మదర్ సెంటిమెంట్ తో పాటు ‘గని’ అనే బాక్సర్ జీవితంలోని ఇతర అంశాలను తెరపై చూపించే ప్రయత్నం కిరణ్ చేశాడని తెలిపారు. పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’, శ్రీహరి ‘భద్రాచలం’, ‘రాకీ’ ఫ్రాంచైజ్ మూవీస్ తనకు ఎంతో ఇష్టమని, హిందీలో వచ్చినట్టుగా తెలుగులో ఎక్కువ క్రీడా నేపథ్య చిత్రాలు రాలేదని, ఆ లోటు ‘గని’తో తీర్చాలనుకున్నామని అన్నారు.
తన చిత్రాల జయాపజయాల నుండే పాఠాలు నేర్చుకుంటానని, మరీ ముఖ్యంగా పరాజయం పాలైన సినిమాలను విశ్లేషించుకుంటానని వరుణ్ తేజ్ చెప్పారు. ‘మిస్టర్’ మరీ పాత కథ అయిపోయిందని, అలానే ‘అంతరిక్షం’ మరీ కొత్త కథ అయిపోయిందని, అంత కొత్తదనాన్ని తెలుగువాళ్ళు కోరుకోవడం లేదని ఆ సినిమా ఫలితంతో తెలిసిందని అన్నారు. అయితే మరీ రొట్టకొట్టుడు కథలు కాకుండా వీలైనంత భిన్నమైన చిత్రాలు చేయాలన్నది తన అభిమతమని వరుణ్ తేజ్ తెలిపారు.