నాగశౌర్య, రీతువర్మ జంటగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా నిజానికి దసరా కానుకగా శుక్రవారం విడుదల కావాల్సింది. కానీ పలు చిత్రాలు విడుదల కావడంతో దీనిని వాయిదా వేశారు. అయితే… ఇదే నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కాబోతోంది.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’, అలాగే ‘దిగు దిగు నాగ’, ‘మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ’ పాటలు బహుళ ప్రజాదరణ పొందాయని, ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా కూడా అలరిస్తుందనే నమ్మకం ఉందని దర్శక నిర్మాతలు తెలిపారు. నదియా, మురళీశర్మ, వెన్నెలకిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, ‘రంగస్థలం’ మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు.