Vamshi Paidipally Birthday Special :
నవతరం దర్శకుల్లో ప్రతి ఒక్కరు తమ ఉనికిని చాటుకోవడానికి వైవిధ్యంతో సాగుతున్నారు. విజయం సాధించిన తరువాత ప్రతిభను మరింతగా ప్రదర్శించాలనీ తపిస్తుంటారు. ఆ పై లభించిన పేరును నిలుపుకొనే ప్రయత్నంలోనూ సరైన కథ కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటారు. దర్శకుడు వంశీ పైడిపల్లి అలా సాగుతున్నారు కాబట్టే పరుగులు తీస్తూ సినిమాలు తెరకెక్కించడం లేదు. ఘనవిజయాలు పలకరించినా, పులకించి పోయి వేగమూ పెంచలేదు. ఆచి తూచి అడుగులేస్తూ సాగుతున్నారు.
పైడిపల్లి వంశీధరరావు 1979 జూలై 27న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో జన్మించారు. వాళ్ళ నాన్నకు ఖానాపూర్ లో సినిమా థియేటర్ ఉండేది. దాంతో చిన్న తనం నుంచీ వంశీకి సినిమాలంటే ఆకర్షణ. చదువులోనూ అంతే ఆసక్తితో సాగారు. హైదరాబాద్ జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి వరకు చదివిన వంశీ, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్స్ లో మాస్టర్ డిగ్రీ సాధించారు. సినిమాలపై ఆసక్తితో 2002లో ప్రభాస్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘ఈశ్వర్’కు దర్శకుడు జయంత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు వంశీ. తరువాత దిల్ రాజు ‘భద్ర’ సినిమాకు పనిచేస్తూ, ఆయనను తన కథతో ఆకట్టుకున్నారు. వంశీని ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ చిత్రంతో దర్శకునిగా పరిచయం చేశారు దిల్ రాజు. తరువాత జూ.యన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ‘బృందావనం’కు కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఆ సినిమా మంచి విజయం సాధించి, దర్శకునిగా వంశీకి మంచి గుర్తింపును సంపాదించింది.
తొలిచిత్రానికి, రెండో సినిమాకు మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నారు వంశీ. ఆ తరువాత నాలుగేళ్ళకు రామ్ చరణ్, బన్నీతో ‘ఎవడు’ రూపొందించారు. ఈ సినిమాకు కూడా దిల్ రాజు నిర్మాత కావడం విశేషం! ‘ఎవడు’ తీసిన రెండేళ్ళకు నాగార్జున, కార్తీతో ‘ఊపిరి’ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. మరో మూడేళ్ళకు మహేశ్ బాబుతో ‘మహర్షి’ తీశారు వంశీ. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఉత్తమ వినోదభరిత చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఇంత పెద్ద విజయం చూసినా, వంశీ పరుగులు తీయలేదు. ఓ మంచి కథను సిద్ధం చేసుకున్న తరువాత తమిళ స్టార్ హీరో విజయ్ తో ప్రస్తుతం ‘వారిసు’ అనే సినిమాను రూపొందిస్తున్నారు వంశీ. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తూ ఉండడం విశేషం! తెలుగులో ‘వారసుడు’గా ఈ సినిమా రానుంది. వచ్చే యేడాది జనవరిలో ‘వారిసు’ జనం ముందుకు రానుంది. ఆచి తూచి అడుగులేస్తున్న వంశీ పైడిపల్లి ఈ సినిమాతో ఏ స్థాయి సక్సెస్ ను అందుకుంటారో చూద్దాం.