యావత్ సినిమా అభిమానులంతా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ వెండితెరపై కనువిందు చేస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే శుక్రవారం ఉదయం బెన్ ఫిట్ షోలలో స్టార్లు సందడి చేసిన సంగతి తెల్సిందే. ఇక నేటి బెన్ ఫిట్ షోలలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది మెగా కోడలు ఉపాసన కొణిదెల. భర్త రామ్ చరణ్ సినిమాను అభిమానుల మధ్య కూర్చొని అల్లరి చేసింది. పేపర్లు విసురుతూ, అరుస్తూ ఫ్యాన్ గర్ల్ గా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఉపాసన సినిమా చూశాక తన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. “నా ఉత్సాహం స్థాయి హై లో ఉంది. నన్ను ఈ షోకు రమ్మని తోసినందుకు ఎస్ ఎస్ కార్తికేయ మరియు పూజకు ధన్యవాదాలు. నమ్మశక్యంగా లేదు.. చాలా ఆనందించాను. ఎస్ఎస్ రాజమౌళి గారు క్రేజీ రష్ .. ఏ సినిమా దీన్ని అధిగమించలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో భార్య ఇలా భర్త సినిమాను థియేటర్లో చూసి ఇంతగా రచ్చ చేసింది లేదు. ఏదిఏమైనా ఉపాసన నిజంగా మెగా కోడలు అనిపించుకుంది అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.