Ukku Satyagraham:విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉక్కు సత్యాగ్రహం’ ఆడియోను గద్దర్ చేతులమీదుగా విడుదల చేశారు. ‘ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష, గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా’ వంటి చిత్రాలను నిర్మించిన సత్యారెడ్డి ఈ సినిమాను రూపొందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాన అంశంతో తాజాగా ‘ఉక్కు సత్యాగ్రహం’ పేరుతో సత్యారెడ్డి తీస్తున్న సినిమా ఇది. ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా తీశారు సత్యారెడ్డి. ఈ చిత్రం కోసం గద్దర్ రచించి, పాడిన ‘సమ్మె నీ జన్మహక్కురన్నో…’ అనే లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ తన చేతుల మీదుగా విడుదల చేసారు. దీనిని ప్రధాన పాత్రధారి సత్యా రెడ్డి, ఇతర ఆర్టిస్టులతో పాటు గద్దర్ పై చిత్రీకరించారు. తాజాగా సుద్దాల అశోక్ తేజ రచించిన మరోపాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ఈవెంట్ లో గద్దర్, సత్యారెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కిన, ఆర్. నారాయణమూర్తి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ఇక ఈ వేదికపై ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ‘గద్దర్ ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలందించారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తుంటే దానిని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం న్యాయమా? అందుకే కాదు అని ప్రశ్నిస్తూ సినిమా తీసాడు సత్యారెడ్డి. కళాకారుడు ప్రశ్నించాలి’ అని అంటూ రాజకీయ పార్టీలను ఉద్దేశించి ప్రైవేటీకరణ ఆపేలా చేయాలని విజ్ఞప్తి చేసారు.
గద్దర్, ఆర్ నారాయణమూర్తి తో జ్ఞాపకాలను పంచుకుంటూ వంగపండును స్మరించుకున్నారు. విశాఖ ఉక్కు విశాఖపట్నం ప్రజలది మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిదని, మొత్తం తెలుగు ప్రజలందరూ ఏకమవ్వాలని పిలిపునివ్వటమే కాకుండా అందరు కలిస్తే ఈ ప్రైవేటీకరణ ఆపగలరని అన్నారు.