ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి, ఆయన మిత్రుడు డాక్టర్ కె.యల్.నారాయణ కలసి అనేక జనరంజకమైన చిత్రాలు నిర్మించారు. జగపతిబాబు, సౌందర్య జంటగా వారు నిర్మించిన ‘దొంగాట’ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1997 జూలై 11న ‘దొంగాట’ చిత్రం విడుదలయింది.
‘దొంగాట’ కథ ఏమిటంటే – అమాయకురాలైన పల్లెటూరి సుబ్బలక్ష్మి తన బావ ప్రకాశ్ ను ఎంతగానో ప్రేమిస్తుంది. అతను పై చదువులకు పట్నం వెడతాడు. బావకోసం ఎదురుచూపులు చూసిన సుబ్బలక్ష్మి ఓ సారి అతడిని ఎలాగైనా కలుసుకోవాలని బయలు దేరుతుంది. ఆమె ప్రయాణిస్తున్న రైలులోనే రాజు అనే దొంగ ఉంటాడు. అతడు ఓ నెక్లెస్ దొంగిలించి, పోలీసులు వెంటపడగా, వారి నుండి తప్పించుకోవడానికి ఆ గొలుసును సుబ్బలక్ష్మి బ్యాగ్ లో వేస్తాడు. తరువాత ఆ నెక్లెస్ కోసం సుబ్బలక్ష్మి వెంట రాజు తిరగాల్సి వస్తుంది. ఆ సమయంలో పలు మార్లు సుబ్బలక్ష్మిని రక్షిస్తాడు రాజు. చివరకు తన బావను కలుసుకుంటుంది సుబ్బలక్ష్మి. అతడు లావణ్య అనే ధనవంతుల అమ్మాయి ప్రేమలో పడి ఉంటాడు. దాంతో సుబ్బలక్ష్మిని చీదరించుకుంటాడు. సుబ్బలక్ష్మికి రాజు అండగా నిలుస్తాడు. ఆమెను మోడరన్ గా మారుస్తాడు. జయపూర్ లో లావణ్యతో పాటు ప్రకాశ్ ఉన్నాడని తెలుసుకొని, అక్కడకు సుబ్బలక్ష్మి, రాజు వెళతారు. లావణ్యతో స్నేహం చేస్తారు. లావణ్యతో రాజు సన్నిహితంగా ఉండడం చూసి ప్రకాశ్ తట్టుకోలేడు. సుబ్బలక్ష్మి అన్నిటికీ కారణమని భావించి, ఆమెను చంపే ప్రయత్నం చేస్తాడు ప్రకాశ్. లావణ్యకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రకాశ్ ను లావణ్య గెంటేస్తుంది. దాంతో మళ్ళీ సుబ్బలక్ష్మి దగ్గరకు చేరాలనుకుంటాడు. అయితే ఆమె అతడిని అసహ్యించుకొని తన ఊరికి వెళ్తుంది. రాజు కొట్టేసిన నెక్లెస్ ను ఎలాగైనా సొంతదారులకు చేర్చాలని ఏసీపీ విక్రమ్ ప్రయత్నిస్తుంటాడు. అతనికి రాజుపై తనకు ప్రేమ ఉన్న విషయం చెప్పి, తన దగ్గర ఉన్న నెక్లెస్ ను ఏసీపీకి ఇచ్చేసి ఉంటుంది సుబ్బలక్ష్మి. ఏసీపీ ద్వారా సుబ్బలక్ష్మికి తనపై ప్రేమ ఉందని తెలుసుకున్న రాజు, ఆమెను చేరుకుంటాడు. దాంతో కథ సుఖాంతమవుతుంది.
రాజుగా జగపతిబాబు, సుబ్బలక్ష్మిగా సౌందర్య, ప్రకాశ్ గా సురేశ్ నటించిన ఈ చిత్రంలో రితూ శివపురి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుధాకర్, శరత్ బాబు, బాబు మోహన్, మల్లికార్జునరావు, శుభలేఖ సుధాకర్, ఎమ్.బాలయ్య, గౌతమ్ రాజు, నామాల మూర్తి, అల్ఫోన్సా, ప్రియ, రాగిణి, డబ్బింగ్ జానకి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. రమణీభరద్వాజ్ స్వరకల్పన చేసిన ఈ చిత్రానికి సీతారామశాస్త్రి, భువనచంద్ర, సాహితి పాటలు రాశారు. ఇందులోని “ఓ చిలకా… రా చిలకా…”, “చిలిపి చిరుగాలి…”, “ఓ ప్రియా ఏదో…”,”లాలాగూడ మల్లేశా…”, “స్వప్నాల వెంట…” అంటూ సాగే పాటలు అలరించాయి.
‘దొంగాట’ సినిమాకు ‘ఫ్రెంచ్ కిస్’ అనే ఆంగ్ల చిత్రం ఆధారం. ఆ కథను తెలుగు వాతావరణానికి అనువుగా దివాకర్ బాబు, కోడి రామకృష్ణ మార్పులూ చేర్పులూ చేశారు. ‘దొంగాట’ విడుదలైన సంవత్సరానికి అదే ‘ఫ్రెంచ్ కిస్’ ఆధారంగా హిందీలో అజయ్ దేవగణ్, కాజోల్ ‘ప్యార్ తో హోనా హీ థా’ అనే సినిమా రూపొందింది. తెలుగులో ‘దొంగాట’ అలరించినట్టుగానే, హిందీలోనూ ‘ప్యార్ తో హోనా హీ థా’ కూడా ఆకట్టుకుంది.