తెలుగు బుల్లితెర నటి మైథిలీ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పోలీసులు తనకు న్యాయం చేయడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకే వీడియో కాల్ చేసి లైవ్ లోనే గుర్తు తెలియని ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నటి మైథిలీ, తన భర్త తో కలిసి ఎస్ ఆర్ నగర్ పరిసర ప్రాంతంలో నివాసముంటుంది. గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో గతంలో కూడా ఒకసారి పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది మైథిలీ.. అయితే పోలీసులు ఏదో విధంగా సర్దిచెప్పి ఆమెను ఇంటికి పంపించేశారు.
ఇక తాజాగా ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తాను కొనుక్కున్న కారును బలవంతంగా తీసుకున్నాడని, అడిగినా ఇవ్వడం లేదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతామని చెప్పగా.. ఇంటికి వెళ్లిన ఆమె తనకు న్యాయం జరగలేదంటూ పోలీసులకు వీడియో కాల్ చేసి లైవ్ సూసైడ్ చేసుకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమె ఇంటికి చేరుకొని ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఇక మైథిలీ పలు తెలుగు సీరియల్స్ లోను నటించినట్లు సమాచారం.