Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?

Senior Stars

Senior Stars

టాలీవుడ్‌లో సీనియర్ స్టార్లు, పాన్ ఇండియా స్టార్ల మధ్య సినిమాల మేకింగ్ విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. సీనియర్ స్టార్లు వేగంగా సినిమాలు చేస్తుంటే, ట్రెండింగ్ స్టార్లు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్లు ప్రేక్షకులకు నిరంతరం వినోదం పంచుతూ మార్కెట్‌ను కాపాడుకుంటున్నారు. ‘విశ్వంభర’ ఆలస్యమైనా.. అనిల్ రావిపూడి, బాబీ (‘కాకా’) లాంటి ప్రాజెక్టులతో చిరంజీవి స్పీడ్ పెంచారు. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’తో పాటు మరో ఫ్యామిలీ సినిమాను లైన్‌లో పెట్టి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. బాలకృష్ణ ‘దాదా’, కొరటాల శివ ప్రాజెక్టులతో స్పీడ్ చూపిస్తున్నారు. నాగార్జున వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ (‘కుబేర’, ‘కూలీ’) తన కెరీర్‌లో 100వ సినిమాతో విభిన్నంగా ముందుకెళ్తున్నారు.

మరోవైపు పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబుల లైనప్ భారీగానే ఉన్నా, సినిమాల మధ్య గ్యాప్ బాగా పెరుగుతోంది. ప్రభాస్ చేతిలో ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులున్నా, పోస్ట్‌పోన్‌మెంట్లు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. రామ్‌చరణ్ (సుకుమార్ ప్రాజెక్ట్), అల్లు అర్జున్ (‘రాఖా’, లోకేష్ చిత్రాలు), ఎన్టీఆర్ (ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’) గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా భారీ చిత్రాలు చేస్తూ ఒక్కో సినిమాకు మూడేళ్లకు పైగా సమయం తీసుకుంటున్నారు. ఇక మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’కే పూర్తిగా అంకితమవ్వడంతో ఆయన నుంచి రెగ్యులర్ సినిమాలు అభిమానులకు దూరమవుతున్నాయి. మొత్తం మీద, గ్లోబల్ ఇమేజ్ కోసం ఏళ్ల తరబడి ఒకే సినిమా చేయడం వల్ల ప్రేక్షకులకు కొత్త సినిమాల గ్యాప్ వస్తోంది. సీనియర్ల స్పీడ్, యువ హీరోల పాన్ ఇండియా ఇమేజ్.. రెండింటి లక్ష్యం మార్కెట్ పెంచుకోవడమే అయినా, కేవలం భారీ కాన్వాస్ మాత్రమే సరిపోదు. క్వాలిటీ, బలమైన కథలతో పాటు సినిమాల మధ్య విరామాన్ని తగ్గించుకుని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే గుర్తుండిపోయే చిత్రాలు అందించడమే ఏ స్టార్‌కైనా భవిష్యత్తును నిర్ణయిస్తుంది.