Telugu Cinema: గత వారం విడుదలైన తెలుగు సినిమాలు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ‘ఏజెంట్’ పరాజయం పాలైంది. చిత్రం ఏమంటే.. ఆ సినిమా పరాజయానికి తానే బాధ్యుడినంటూ నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇక మణిరత్నం ‘పి.ఎస్.-2’ తెలుగువారిని పెద్దంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదే వారం వచ్చిన ‘రా రా పెనిమిటి’, ‘విద్యార్థి’ చిత్రాల రిజల్ట్ మొదటి ఆటకే తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో మే మొదటి వారాంతంలో అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా ఎనిమిది విడుదల కానుండటం విశేషమే.
మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన ‘రామబాణం’ 5వ తేదీ జనం ముందుకు వస్తోంది. హీరో గోపీచంద్ కు ఇది 30వ చిత్రం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి. జి. విశ్వప్రసాద్ దీన్ని నిర్మించారు. గతంలో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలు సక్సెస్ కావడంతో సహజంగానే దీనిపై కొంతమేరకు అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చగా, జగపతిబాబు, ఖుష్ బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, తరుణ్ అరోరా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదే వారం వస్తున్న మరో సినిమా ‘ఉగ్రం’. ‘అల్లరి’ నరేశ్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మిర్నా మీనన్ హీరోయిన్. మిస్సింగ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. గతంలో నరేశ్ హీరోగా ‘నాంది’ సినిమాను తెరకెక్కించిన విజయ్ కనకమేడల దీనికి దర్శకుడు. దాంతో ఈ సినిమా కూడా దాని తరహాలోనే ఇంటెన్సిటీతో ఉంటుందనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేశారు. బట్… దర్శక నిర్మాతలు మాత్రం ‘నాంది’ని మించిన ఇంటెన్సిటీతో ‘ఉగ్రం’ ఉంటుందని చెబుతున్నారు. సిన్సియర్ అండ్ సెన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఇందులో నరేశ్ పోషిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. నరేశ్ కు 60వ చిత్రమైన ‘ఉగ్రం’ను సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.
ఈ రెండు సినిమాలతో పాటే ఈ శుక్రవారం ‘అరంగేట్రం’ అనే మరో మూవీ రాబోతోంది. రోషన్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్, పూజ, లయ, ఇందు, సాయిశ్రీ, శ్రీవల్లి, కీర్తన తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. మహి మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి కె. ఈ సైకో థ్రిల్లర్ మూవీని నిర్మించారు. అలానే అనిరుధ్, యశస్విని జంటగా భిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో చంద్రకళ పందిరి నిర్మించిన సినిమా ‘యాద్గిరి & సన్స్’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. వీటితో పాటే ‘హీట్’ అనే మరో సినిమా రాబోతోంది. వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ ఐదు స్ట్రయిట్ సినిమాలతో పాటు మరో మూడు అనువాద చిత్రాలు కూడా ఈ ఫ్రైడే జనం ముందుకు వస్తున్నాయి. అందులో మొదట చెప్పుకోవాల్సింది ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ -3’. మార్వెల్ స్టూడియోస్ నుండి వస్తున్న ఈ సినిమా ఆంగ్ల, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది.
పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న మరో సినిమా ‘ది కేరళ స్టోరీ’. అదాశర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే వివాదాలకు తెరలేపింది. కేరళలోని హిందు, క్రైస్తవ మహిళలు మతం మారిన తర్వాత ఉగ్రవాద సంస్థ ఐసిస్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారనే అంశాన్ని ఈ సినిమాలో దర్శకుడు సుదీప్తో సేన్ చూపించాడు. దాంతో రాజకీయంగానూ ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కేరళలో దీన్ని విడుదల చేయకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్, సీపీఎం పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే రోజున కన్నడ సినిమా ‘ఇంగ్లీష్ మంజ’ తెలుగులో ‘ఇంగ్లీష్ మంజు’ పేరుతో డబ్ అయ్యి జనం ముందుకు వస్తోంది. ప్రమోద్, తేజస్విని శర్మ జంటగా నటించిన ఈ సినిమాను ఆర్య మహేశ్ దర్శకత్వంలో డేవిడ్ ఆర్ నిర్మించారు. మరి ఈ ఏడు సినిమాలలో ఏ చిత్రం వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతారో చూడాలి.