Telugu Movies: లాస్ట్ వీకెండ్ డబ్బింగ్ మూవీస్ తో కలిపి ఏకంగా తొమ్మిది చిత్రాలు జనం ముందుకు వచ్చాయి. అయితే ‘అమిగోస్’తో సహా ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న సినిమాలపై తెలుగు ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు. సహజంగా శుక్రవారం సినిమాలు విడుదల అవుతాయి. అయితే శనివారం మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఎక్కువ చిత్రాలు ఆ రోజున రిలీజ్ కాబోతున్నాయి.
ముందు అనుకున్న ప్రకారం శుక్రవారం ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా ‘సార్’తో పాటు ఆంగ్ల అనువాద చిత్రం ‘యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాన్టుమేనియా’ విడుదల అవుతోంది. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధనుష్ నటించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలానే కొంతకాలంగా అతని సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతున్నాయి. కానీ ధనుష్ ఓ స్ట్రయిట్ తెలుగు మూవీలో హీరోగా నటించడం మాత్రం ‘సార్’తోనే జరిగింది. యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీమతి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. విద్యావ్యవస్థలోని లోటుపాట్లను తెలిపే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ 17వ తేదీ రిలీజ్ అవుతోంది. ఇక మార్వెల్ సీరిస్ కు చెందిన ‘యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాన్టుమేనియా’ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ సైతం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇదిలా ఉంటే మహా శివరాత్రి కానుకగా మూడు తెలుగు సినిమాలు శనివారం ప్రేక్షకులను పలకరించనున్నాయి. అందులో చెప్పుకోవాల్సిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. జీఏ2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు దీన్ని నిర్మించారు. కిరణ్ అబ్బవరం హీరో, కశ్మీర పర్దేశీ హీరోయిన్ గా నటించారు. మురళి కిషోర్ అబ్బూరు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గత యేడాది విడుదలైన కిరణ్ అబ్బవరం మూడు చిత్రాలు పరాజయం పాలైనా… ఈ సినిమాకు మాత్రం సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. తిరుపతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ బాగుండటంతో విజయంపై అందరికీ ఆశలు రేకెత్తాయి. చిత్రం ఏమంటే… అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు, అల్లుడు నిర్మిస్తున్న సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’ నుండి పోటీ ఎదురు కాబోతోంది. సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ జంటగా నటించిన ‘శ్రీదేవి శోభన్ బాబు’తో ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో నాగబాబు, రోహిణి కీలక పాత్రలు పోషించారు. తెలుగు దనం ఉట్టిపడే ఈ సినిమా విజయంపై సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటే సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు తెరకెక్కించిన 76వ చిత్రం ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ’ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ హారర్ కామెడీ మూవీని నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించారు. సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావు తనయుడు యశ్వంత్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా నటి సత్యకృష్ణన్ కుమార్తె అనన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అలానే మరో కీలక పాత్రను జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ పోషించాడు. మరి ఈ ఐదు సినిమాలలో ఏ చిత్రానికి ప్రేక్షకులు ఓటు వేస్తారో వేచి చూడాలి.