Susanth: మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’ ఈ నెల 7న జనం ముందుకు రాబోతోంది. ఇందులో ఐదు మంది కథానాయికలే కాదు… హీరో సుశాంత్ కూడా ఓ కీలక పాత్రను పోషించాడు. ‘రావణాసుర’ సినిమా గురించి సుశాంత్ మాట్లాడుతూ, “ఇందులో రాముడు ఎవరు రావణాసుడు ఎవరు అనేది ఇప్పుడు చెప్పడం సరి కాదు. బట్ ‘సుశాంత్ యాజ్ రామ్’ అనే పోస్టర్ ను రవితేజ మొదట్లో రిలీజ్ చేశారు. సో… ‘రావణాసుర’ టైటిల్ రోల్ రవితేజ గారిది. మీరు ట్రైలర్ చూస్తే గ్రే షేడ్స్ అందరికీ వున్నాయనేది అర్థం అవుతుంది. ‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అనే ట్యాగ్ లైన్ కూడా వుంది. మరి ఇందులో రాముడు ఎవరో.. రావణాసురుడు ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రావణాసుర చాలా ఎక్సయిటింగ్ థ్రిల్లర్. కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. ట్రీట్ మెంట్ కొత్తగా వుంటుంది” అని చెప్పారు. తాను నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ మూవీ కూడా కొంత థ్రిల్లర్ జోనర్ కు చెందిందే అని అయితే, కంప్లీట్ థ్రిల్లర్ మూవీ మాత్రం ‘రావణాసుర’నే అని సుశాంత్ తెలిపారు.
తన పాత్రకు సంబంధించిన చెప్పిన మార్పుల గురించి మాట్లాడుతూ, “అభిషేక్ గారు ఫోన్ చేసినపుడు, సోలో హీరోగా ఒక కథ రెడీ చేసి సినిమా చేయాలనే ఆలోచనలో వున్నాను. అభిషేక్ గారికి కూడా అదే చెప్పాను. కానీ ఈ కథ విన్నపుడు చాలా ఎక్సయిటింగా అనిపించింది. రవితేజ గారిని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఒక ప్రేక్షకుడిగా నాకు చాలా కొత్తగా అనిపించింది. నా పాత్ర చాలా కీలకంగా వుంది. సినిమా అంతా వుంటుంది. దీనికి మరో డైమెన్షన్ తోడైతే బావుంటుదని చెప్పాను. సుధీర్ వర్మ గారికి కూడా అది నచ్చి చాలా ఫాస్ట్ గా వర్క్ చేసి నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా ఆ డైమెన్షన్ ని తీసుకొచ్చారు. దాంతో మరో లేయర్ యాడ్ అయ్యింది. రవితేజ గారికి కూడా ఇది చాలా నచ్చింది. నేను అనుకున్న దాని కంటే మూవీ బాగా వచ్చింది” అని అన్నారు.
నిర్మాత అభిషేక్ నామా గురించి చెబుతూ, “అభిషేక్ గారితో నాది గ్రేట్ జర్నీ. నిజానికి ఈ సినిమాలో ఈ పాత్రని నన్ను తీసుకోవాలనే ఆలోచన కూడా ఆయనిదే. ఈ సందర్భంగా అభిషేక్ గారి కృతజ్ఞతలు. ఇక నా పాత్ర విషయానికి వస్తే… దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్సయిట్ మెంట్ వుంది. ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ వినలేదు చూడలేదు. అందుకే కథ వినగానే ఓకే చేశాను. ప్రేక్షకులు కూడా ఈ కొత్తదనం ఫీలౌతారు” అని అన్నారు. సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. మధ్యలో కెరీర్ పరంగా కొంత గ్యాప్ కూడా వచ్చింది. దాని గురించి చెబుతూ, “అక్కినేని కుటుంబం నుంచి రావడం నా అదృష్టం. అయితే నేను మొదటి నుంచి కూడా నాకు వస్తున్న అవకాశాలతోనే ముందుకు వెళ్లాను. కొన్ని సినిమాల నిర్మాణం ఆలస్యం కావడం, అనుకున్న సమయానికి రాకపోవడం… ఇలా నా చేతుల్లో లేనివి కూడా కొన్ని జరిగాయి. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందో కొన్ని సార్లు నాకే అర్థం కాలేదు. ‘చి.ల.సౌ.’ తర్వాత ఇక గ్యాప్ తీసుకోకూడదని బలంగా నిర్ణయించుకున్న బట్ ఆ తర్వాత కోవిడ్ రావడంతో మళ్ళీ గ్యాప్ వచ్చింది. అయితే గత ఆరు నెలలుగా చాలా బిజీగా వున్నాను. సోలో హీరోగా ఒక కథ ఓకే చేశాను. ఇంకొన్ని కథలు వింటున్నాను. నిజానికి ‘అల వైకుంఠపురములో’ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. నార్త్ లో కూడా ఫేమ్ తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. నేను అన్నీ చేయలేదు. “రావణాసుర, భోళా శంకర్”కు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. త్వరలో సోలో హీరోగానూ ఓ సినిమా మొదలవుతుంది” అని అన్నారు.