The Kerala Story: లవ్ జీహాద్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ఈ నెల 5వ తేదీ విడుదలైంది. కేరళకు చెందిన హిందూ, క్రైస్తవ యువతులను ప్రేమపేరుతో ఐసిఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు లొంగదీసుకుని, ఆ తర్వాత విదేశాలకు తరలించి, తమకు అనుకూలంగా… భారతదేశానికి వ్యతిరేకంగా ఎలా పని చేయించుకుంటున్నారో ఈ చిత్రంలో చూపించారు. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆ మధ్య వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో పోల్చడంతో దేశ వ్యాప్తంగా బాగానే చర్చ జరుగుతోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయాలని తొలుత నిర్మాతలు భావించారు. అయితే తెలుగు వర్షన్ మాత్రం కాస్తంత ఆలస్యంగా విడుదలైంది. దీన్ని శనివారం నాడు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు. విశేషం ఏమంటే… హైదరాబాద్ తో సహా పలు నగరాలు, పట్టణాలలో హిందుత్వ సంస్థలు యువతులకు ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశాయి. స్వచ్ఛందంగా విరాళాలను సేకరించి, థియేటర్లకు చెల్లించి, యువతలకు ఉచితంగా చూపిస్తున్నారు. తెలుగు వర్షన్ విడుదలైన తర్వాత పలు పట్టణాలలోనూ ఇదే పంథాను అనుసరిస్తున్నారు.
ఇదిలా ఉంటే… నిర్మల్ జిల్లా భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ మూవీ ప్రదర్శన మూడు రోజులుగా పలు వివాదాలకు తెరలేపింది. కమల థియేటర్ లో ఈ సినిమాను ప్రదర్శించడానికి పంపిణీదారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే శుక్ర, శనివారాల్లో పోలీసులు థియేటర్ ను మూయించి వేశారు. ఆదివారం యథావిధిగా మార్నింగ్ షో, మాట్నీ సాఫీగా ప్రదర్శించారు. కానీ ఫస్ట్ షో ఆరంభమైన కొద్ది సేపటికే తిరిగి పోలీసులు రంగ ప్రవేశం చేసి, షో అర్థాంతరంగా నిలిపివేశారు. థియేటర్ లో ఉన్న ప్రేక్షకులనూ బలవంతంగా బయటకు పంపేశారు. అనుమతి లేకుండా సినిమాను ఎలా ప్రదర్శించారంటూ థియేటర్ మేనేజర్, పంపిణీ దారుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు వారిని పీ.ఎస్.కు తరలించి, థియేటర్ కు తాళాలు వేశారు. దాంతో భైంసా పట్టణంలోని హిందూ అనుకూల సంఘాలు పోలీసులతో వాగ్వివాదానికి దిగాయి. పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీయడంతో కొందరు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సినిమాను ముస్లిం వర్గాలు వ్యతిరేకించడం లేదని, కొందరు కుహనా లౌకిక వాదులే దీని ప్రదర్శనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.