మన తెలుగు సినిమాకు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఇంతకు ముందు టాప్ హీరోల సినిమాలే విదేశాలలో విడుదల అయ్యేవి. ఇక అమెరికాలో అయితే మన కంటే ఓ రోజు ముందే రిలీజ్ అవుతుండేవి. అయితే మారిన పరిస్థితుల్లో అలా ఓ రోజు ముందు ప్రదర్శించటం వల్ల తెలుగు రాష్ట్రాలలో ఆ యా సినిమాల ఫలితాలు ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో షో ఆరంభం అయిన నిమిషం నుంచే అలా ఉంది.. ఇలా ఉంది అంటూ ఎవరికి వారు తమ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. బారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఓ మాదిరి సినిమాలను కూడా ఈ సెల్ఫ్ రివ్యూలు దెబ్బ తీస్తున్నాయి. దీంతో తెలుగు నిర్మాతలు ఇకపై తెలుగు రాష్ట్రాలలో సినిమాలు విడుదల చేసే టైమ్ లోనే యుఎస్ లోనూ విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో ‘విరాట పర్వం, పక్కా కమర్షియల్’ వంటి సినిమాలను ఇదే పద్ధతిలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిజల్ట్ అన్ని చోట్లా ఒకే విధంగా ఉండటంతో రెండూ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ వారం విడుదల కానున్న రామ్ ‘వారియర్’ తో పాటు వచ్చే వారం విడుదల కాబోతున్న నాగచైతన్య ‘థ్యాంక్యూ’, ఆ తర్వాత వచ్చే రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ, నిఖిల్ ‘కార్తికేయ2’, దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’, కళ్యాణ్ రామ్ ‘బింబిసార’కు ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నారట. మన వారు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే అల్టిమేట్ గా సినిమా బాగుండాలి. ఓ రోజు ముందా? వెనకా? అన్నది ముఖ్యం కాదు. సినిమా బాగుంటే యుఎస్ లో ముందు రోజు రిలీజ్ అయిన సినిమాకు తెలుగు రాష్ట్రాలలో మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మన సినిమాల సక్సెస్ పర్శంటేజ్ 7శాతానికి మించని ఈ రోజుల్లో ఓ విధంగా ఏకకాలంలో విడుదల చేయటమే మంచి దేమో! ఏమంటారు!?