The Kerala Story: ఈ మధ్యకాలంలో ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత హిట్ అందుకున్న సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటిటీలో ప్రత్యేక్షమవుతుంది. కానీ, ఏడాది దాటినా కూడా ది కేరళ స్టోరీ మాత్రం ఓటిటీకి వచ్చిందే లేదు. గతేడాది మే 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ది కేరళ స్టోరీ చిత్రం మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు ఎన్నో వివాదాలు అలుముకున్నాయి. రిలీజ్ అయ్యాకా సినిమాను బ్యాన్ చేయాలనీ రాజకీయ నేతలు చాలా కష్టపడ్డారు. థియేటర్లకు ప్రేక్షకులను రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.
తమిళనాడు రాష్ట్రం మొత్తం ఈ సినిమా రిలీజ్ అయ్యాకా అట్టుడికిపోయింది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కూడా వివాదాలే అడ్డంకులుగా మారాయి. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమ ఎట్టకేలకు ఓటిటీ బాట పట్టింది. ప్రముఖ ఓటిటీ సంస్థ జీ5.. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 12 న కానీ, జనవరి 19 న కానీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఓటిటీ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమా ఓటిటీ ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.