అదేంటి ప్రభాస్ ఫ్రెండ్ ఇప్పుడు హీరోగా పరిచయం కావడం ఏంటి? అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. అయితే అది రియల్ ఫ్రెండ్ కాదు, రీల్ ఫ్రెండ్. ఈశ్వర్ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు వెండితెరకు పరిచయమైన హను కోట్ల. ఆ సినిమాలో మూగ పాత్రలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉద్యోగరీత్యా బి.ఎ యాక్టింగ్, ఎం.ఎ. మీడియా డైరెక్షన్ కోర్సుల్లో విద్యార్థులకు బోధనా ఉపాధ్యాయుడిగా కొనసాగడం వల్ల ఈశ్వర్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తగిన పాత్ర కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు ‘ది డీల్’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు హను.
ఇక హను తనకున్న అపార అనుభవంతో ‘ది డీల్’ సినిమాని రూపొందించారు.. ఈ సినిమాని అక్టోబర్ నెలలో దసరా పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సిటాడెల్ క్రియేషన్, డిజిక్విస్ట్ సంయుక్తంగా ‘ది డీల్’ సినిమాని నిర్మిస్తుండగా హను కోట్ల పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ మొదటి భాగం మొత్తం హైదరాబాద్ లో.. కొంత మలేషియాలో చిత్రీకరించామని, మలి భాగాన్ని మొత్తం మలేషియాలో షూటింగ్ చేసి చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నట్లు టీం చెబుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ లుగా చందన, ధరణి ప్రియా నటించగా రఘు కుంచె, రవి ప్రకాష్, మహేష్ పవన్, గిరి, వెంకట్ గోవాడ, శ్రీవాణి, సుజాత దిక్షిత్, సురభి లలిత ముఖ్య పాత్రలు పోషించారు.