Teppa Samudram: సింగర్ కమ్ లిరిసిస్ట్ పెంచల్ దాస్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి అని ఏడిపించినా.. శ్రీకారం సినిమాలో భలేగుంది బాలా అంటూ అమ్మాయిని ఆటపట్టించినా.. కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు దుమ్ము చూడు మామ అంటూ హుషారెత్తించినా.. పెంచల్ దాస్ కె చెల్లింది. ఎన్నో పాటలు ఆయన చేతినుంచి జాలువారాయి.. ఆయన గొంతు నుంచి వినిపించాయి. తాజాగా ఆయన రాసి, పాడిన పాట ఒకటి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. నా నల్లా కలువా పువ్వా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో వారికోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈపాటలో మనసుని కదిలించేలా చూపించారు. సాంగ్ ఆద్యంతం చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు.. ఏం రాశావయ్యా పెంచల్ దాస్.. గుండెలను మెలిపెట్టేశావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.