Tamil Actor To Play Villain Role in NBK108 Movie: ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 ప్రాజెక్ట్ చేస్తోన్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేయనున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఇది సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్, కీలకమైన నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఆల్రెడీ ఇందులో బాలయ్య కూతురిగా పెళ్లి సందD ఫేమ్ శ్రీలీలాను ఎంపిక చేశారు. ఇప్పుడు మరో కీ-రోల్ కోసం ఓ తమిళ నటుడ్ని ఎంపిక చేశారని సమాచారం. ఇంతకీ అతనెవరు? అని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. అరవింద్ స్వామి.
ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన అరవింద్ స్వామి.. ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా.. ధృవ సినిమాలో ‘మనిషి ముసుగులో మృగమును నేనేరా’ అంటూ చూపించిన విలనిజం అయితే, అందరినీ కట్టి పడేసింది. అందులో అతను పోషించిన విలన్ రోల్‌ని సర్వత్రా ప్రశంసలు వచ్చిపడ్డాయి. అందుకే, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అరవింద్‌ని తీసుకోవడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు NBK108లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసమే అరవింద్ స్వామిని తీసుకున్నట్టు తెలుస్తోంది. అనిల్ చెప్పిన స్టోరీ నచ్చడంతో, ఈ సినిమాలో నటించేందుకు అరవింద్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం.. వెండితెరపై బాలయ్య, అరవింద్ స్వామి మధ్య హోరాహోరీ పోరుని విట్నెస్ చేయొచ్చు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
కాగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న NBK107 సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్నట్టు తెలిసింది. ఈ నెలాఖరులోగా చిత్రీకరణ పూర్తవ్వనుందట! ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ నటుడు దునియా విజయ్, తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొలుత ఈ సినిమాను దసరాకే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు కానీ, షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వాయిదా వేసుకోక తప్పలేదు. అయితే.. ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయంపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.