నటభూషణ శోభన్ బాబు తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా ఎదగడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. 1959లో ‘దైవబలం’ చిత్రంలో తొలిసారి తెరపై కనిపించిన శోభన్ బాబుకు సోలో హీరోగా బంపర్ హిట్ దక్కింది 1971లోనే. ఆయనకు ఆ విజయాన్ని అందించిన చిత్రం ‘తాసిల్దార్ గారి అమ్మాయి’. అప్పటి దాకా శోభన్ బాబు ఇతర స్టార్ హీరోస్ చిత్రాలలో సైడ్ కేరెక్టర్స్ పోషిస్తూనే వచ్చారు. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ మంచి విజయం సాధించింది. ఆ తరువాత వరుస విజయాలతో శోభన్ బాబు తనదైన పంథాలో సాగిపోయారు. మహిళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ చిత్రం ‘సత్యచిత్ర’ పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మించిన తొలి సినిమా. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్.ప్రకాశరావు దర్శకులు. ఇదే ‘సత్యచిత్ర’ బ్యానర్ లో తెరకెక్కిన ‘అడవిరాముడు’తోనే కె.రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ గా మారడం విశేషం!
‘తాసిల్దార్ గారి అమ్మాయి’లోని కథ, కథనం ఈ నాటికీ ఆకట్టుకొనేలా ఉంటుంది. తాసిల్దార్ కూతురు అయిన మధుమతికి, తండ్రి ఆఫీసులో పనిచేసే ప్రసాదరావుతో పెళ్ళవుతుంది. మధుమతికి రాజశేఖరం, గోపాలం అని ఇద్దరు అన్నయ్యలు. భర్తతో అన్యోన్యంగా కాపురం చేస్తున్న మధుమతి చెప్పుడు మాటలు విని భర్తను అనుమానిస్తుంది. తాసిల్దార్ కూడా అల్లుడిని అవమానిస్తాడు. దాంతో ఉద్యోగం పోగొట్టుకున్న ప్రసాదరావు కండెక్టర్ గా పనిచేస్తాడు. పలు పాట్లు పడతాడు. చివరకు లక్షాధికారి అవుతాడు. మధుమతి తన కొడుకు వాసుతో అన్నయ్యలను నమ్ముకొని పుట్టింట్లోనే ఉంటుంది. పలు అవమానాలు ఎదుర్కొంటుంది. లక్షాధికారి అయిన ప్రసాదరావు, ఎంతోమంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ ఉంటాడు. ఇది తెలిసిన గోపాలం, తన మేనల్లుడు వాసుని తండ్రి వద్దకు వెళ్ళమంటాడు. తండ్రి వద్దకు వెళ్ళి, తనను పరిచయం చేసుకొని చదువు చెప్పించమంటాడు వాసు. భార్య మీద కోపం ఉన్నా, తనయుడిపై ప్రేమతో అతణ్ణి బాగా చదివిస్తాడు. కండక్టర్ కొడుకు కలెక్టర్ అయ్యేలా చేస్తాడు తండ్రి. దాంతో మధుమతి అన్నలు, ఎవరికి వారు తమ కూతుళ్ళను వాసుకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. తన తల్లి, తండ్రి ఉన్నా లేనివాడుగా బాధ అనుభవించిన వాసుకు పెళ్ళంటనే విరక్తిగా ఉంటుంది. ఆ నేపథ్యంలో మామయ్యల కూతుళ్ళను పెళ్ళి చేసుకోరాదని భావిస్తాడు. అయితే గోపాలం కూతురు పద్మజ, తన బావనే ప్రేమిస్తుంది. ఆమె మనసు తెలుసుకున్న వాసు వారిస్తాడు. అప్పటి దాకా తన అన్న గోపాలమే కొడుకును చదించాడని మధుమతి భావిస్తూ ఉంటుంది. చివరకు గోపాలం నిజం చెబుతాడు. పద్మజను పెళ్ళాడటానికి వాసు కూడా అంగీకరిస్తాడు. ప్రసాదరావు తన భార్య మధుమతికి పట్టుచీరలు అవి కొనితెస్తాడు. చివరలో భార్యాభర్తల నడుమ అపార్థాలు నెలకొంటే, వారిద్దరే పరిష్కరించుకోవాలని, ఎవరికైనా తావిస్తే, కాపురాలు విచ్ఛిన్నం అవుతాయని నీతి చెబుతాడు ప్రసాదరావు. పద్మజను వాసు పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది.
కావిలిపాటి విజయలక్ష్మి రాసిన ‘విధి విన్యాసాలు’ ఆంధ్రప్రభలో సీరియల్ గా ప్రచురితమయింది. ఈ నవల ఆధారంగానే ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ తెరకెక్కింది. ఈ చిత్రానికి దర్శకులు కె.ఎస్. ప్రకాశరావు స్క్రీన్ ప్లే రాయగా, ఎన్.ఆర్.నంది మాటలు పలికించారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు, జి.సి.శేఖర్ అసోసియేట్ డైరెక్టర్స్ గా పనిచేశారు. కె.ఎస్. ప్రకాశరావు మేనకోడలు మోహన ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. ఈ చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చగా, ఆచార్య ఆత్రేయ పాటలు రాశారు. ఇందులోని “కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం…”, “నీకున్నది నేనని – నాకున్నది నీవని…”, “పాడమన్నావు… పాడుతున్నాను…”, “అల్లరి చేసే వయసుండాలి… ఆశలు రేపే మనసుండాలి…”, “చెక చెకలాడే నడుమును చూడు…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో శోభన్ బాబు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అంతకు ముందు ‘ప్రతీకారం’ అనే జానపదంలోనూ శోభన్ ద్విపాత్రాభినయం చేసి ఉన్నారు. ఆ సినిమా అంతగా పేరు సంపాదించలేక పోయింది. తరువాతి రోజుల్లో అనేక చిత్రాలలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేసి అలరించారు. యన్టీఆర్ తరువాత తెలుగునాట అత్యధిక చిత్రాలలో డ్యుయల్ రోల్ పోషించిన ఘనతను సొంతం చేసుకున్నారు శోభన్. ఇందులో తాసిల్దార్ గా నాగభూషణం, ఆయన కూతురు మధుమతిగా జమున నటించారు. చంద్రకళ, రావి కొండలరావు, సాక్షి రంగారావు ఇతర ముఖ్యపాత్రధారులు.
‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కొన్ని కేంద్రాలలో నేరుగా శతదినోత్సవం చూసింది. శోభన్ బాబుకు అంతకు ముందు ‘మనుషులు మారాలి’ వంటి బిగ్ హిట్ ఉన్నా, ఆ సినిమా క్రెడిట్ అంతా హీరోయిన్ శారదకే దక్కింది. తరువాత కూడా శోభన్ బాబు సోలో హీరోగా నటించిన అనేక చిత్రాలు ఆశలు రేపి ఉసూరుమనిపించాయి. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’తో శోభన్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అలా జనం మదిలో శోభన్ బాబు ‘నటభూషణుడి’గా నిలవడానికి కారణమయింది ‘తాసిల్దార్ గారి అమ్మాయి’. ఇదే సత్యచిత్ర బ్యానర్ పై తరువాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమబంధం’లో హీరోగా నటించారు శోభన్ బాబు.