దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. నటనలో వైవిధ్యం చూపించాలన్నా, పాత్ర కోసం ప్రాణం పెట్టాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఆయన సంపాదించుకున్నారు. అయితే, గత కొంతకాలంగా సూర్య కెరీర్ గ్రాఫ్‌ను గమనిస్తే.. కంటెంట్ పరంగా ‘జై భీమ్’, ‘సూరరై పోట్రు’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పక్కా కమర్షియల్ హిట్లు పడి చాలా కాలం అవుతుంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి, తన పాత ఫామ్‌ను తిరిగి తెచ్చుకోవడానికి సూర్య ఇప్పుడు గట్టి ప్రయత్నం మోదలు పెట్టారు.
Also Read :Rana Daggubati: బెట్టింగ్ యాప్ వివాదంపై.. మొదటి సారిగా స్పందించి రానా ..
ఈసారి రూటు మార్చి పాన్ సౌత్ ఇండియా పై కన్నేశారు. 2026 లో రాబోయే తన మూడు సినిమాల కోసం ముగ్గురు వేర్వేరు భాషల దర్శకులను ఎంచుకోవడం విశేషం. మొదట తమిళ్‌లో దర్శకుడు ఆర్జే బాలాజీతో సూర్య చేతులు కలిపారు.. బాలాజీకి మాస్ ఆడియెన్స్‌ను ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు. సూర్య 45వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్టు ద్వారా తమిళ మాస్ సెంటర్లలో తన ప్రభావాన్ని మరోసారి నిరూపించుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.
ఇక సూర్యకు ఉన్న రెండో అతిపెద్ద మార్కెట్ మన తెలుగు రాష్ట్రాలు.. కాగా సూర్య 46వ సినిమా బాధ్యతను టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి అప్పగించారు. మన నేటివిటీకి తగ్గట్లుగా, తెలుగు ప్రేక్షకులు సూర్యను మరింత ఓన్ చేసుకునేలా ఈ కథ ఉండబోతోంది. వీటితో పాటు కేరళలో సూర్యకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్‌ను క్యాష్ చేసుకోవడానికి, అక్కడ రీసెంట్‌గా సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన జిత్తు మాధవన్ (ఆవేశం ఫేమ్) తో సూర్య 47వ సినిమా ఖరారైంది. మలయాళ చిత్రాల్లో ఉండే వైవిధ్యం, సూర్య లాంటి నటుడి పెర్ఫార్మెన్స్ తోడైతే అక్కడ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
మొత్తానికి కేవలం బాలీవుడ్ లేదా భారీ యాక్షన్ సినిమాల వెంట పడకుండా, దక్షిణాదిలోని ఆయా రాష్ట్రాల నేటివిటీని నమ్ముకోవడం సూర్య తీసుకున్న చాలా తెలివైన నిర్ణయం. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఆ ప్రాంతపు దర్శకులతోనే సినిమాలు చేయడం వల్ల అక్కడి ప్రేక్షకులకు సూర్య మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఒకే ఏడాదిలో మూడు విభిన్న ఇండస్ట్రీల దర్శకులతో పని చేస్తూ, దక్షిణాది బాక్సాఫీస్‌ను షేక్ చేయాలనేది సూర్య మాస్టర్ ప్లాన్. మరి ఈ సరికొత్త వ్యూహం సూర్యను మళ్ళీ నంబర్ వన్ స్థానంలో నిలబెడుతుందో లేదో చూడాలి.