Suresh Babu: సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతూనే డిస్ట్రిబ్యూటర్ గా చేస్తున్న విషయం విదితమే. వారికి అన్ని రాష్ట్రాల్లోనూ థియేటర్స్ ఉన్నాయి. ఎన్నో మంచి చిత్రాలను ఈ బ్యానర్ లో రిలీజ్ చేసి పేరు తెచ్చుకున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సురేష్ బాబు ఒక థియేటర్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది. వైజాగ్ లో ఫేమస్ అయిన జ్యోతి థియేటర్ ను అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ పట్నంలో జ్యోతి థియేటర్ కు పెద్ద చరిత్రనే ఉంది. అక్కినేని నాగేశ్వరావు సినిమాల దగ్గర నుంచి ఇప్పటి అఖిల్ వరకు ఎన్నో సినిమాలు ఆ థియేటర్ లో సిల్వర్ జూబ్లీలు చేసుకున్నాయి. 100 రోజులు పండగలు చేసుకున్నాయి.
అభిమానుల ఆనందోత్సహాల మధ్య హీరోల కటౌట్ లు, ఫ్లెక్సీలు ఎన్నో ఆ థియేటర్ చూసింది. అయితే ఇప్పుడు ఆ థియేటర్ ను అమ్మే ప్రయత్నాలు సాగుతున్నాయట. థియేటర్ అమ్మడానికి కారణాలు.. డబ్బు కాదని, ఓటిటీ రావడంతో సినిమాలను థియేటర్ లో చూడడంలేదని దీనివలన ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టాలు చవిచూస్తున్నారు. ఇక ఐమాక్స్ లు, మల్టీ ఫ్లెక్స్ లు వచ్చాక ఇలాంటి థియేటర్స్ కు రావడానికి ప్రేక్షకులు మక్కువ చూపడం లేదు. దీంతో ఆ థియేటర్స్ మెయింటెనెన్స్ కు ఎక్కువ ఖర్చు అవుతుందని భావించి, థియేటర్ ను అమ్మేయాలని చూస్తున్నారట. ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.