వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్. ఎన్. రావు, యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘వెల్కమ్ టు తీహార్ కాలేజ్’. ఇంటర్మీడియట్ లో విద్య పేరుతో జరుగుతున్న బందిఖానాని, అరాచకాన్ని సునిశిత హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇదని దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ‘ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా, ఆలోచింపజేసే విధంగా ఇందులో చూపించామని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ మాసంలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంద’ని ఆయన అన్నారు. చక్కటి సందేశంతో పాటు యూత్ ను అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో పొందుపరిచామని, .కాలేజ్ స్నేహానికి పటం కట్టే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న ఆశాభావాన్ని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి వ్యక్తం చేశారు.

‘కాలేజీ సి.ఈ.ఓ.గా స్వర్గీయ టి.ఎన్.ఆర్ నటించారని, కాలేజీ లెక్చరర్లగా ఎఫ్.ఎమ్. బాబాయ్, వెంకట్ రామన్, ప్రసాద్, లెండి హరి తదితరులు యాక్ట్ చేశారని, ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఐదు యూత్ ఫుల్ పాటలతో, దీనిని మంచి మ్యూజికల్ క్యాంపస్ ఎంటర్టైనర్ గా నిర్మించామ’ని నిర్మాతలు ఎల్.ఎన్. రావు, రవీంద్రబాబు తెలియచేసారు. గతంలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై ‘రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ, రొమాంటిక్ క్రిమినల్స్’ లాంటి యూత్ ఫుల్ ఫిలిమ్స్ లో నటించిన మనోజ్ నందన్ ‘వెల్కమ్ టు తీహార్ కాలేజ్’లో హీరోగా నటిస్తున్నాడు. ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీరెడ్డి, మనీషా, సాయినాథ్, మౌనిక బేబీ చిన్నారి, సత్యానంద్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.