హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫిక్షనల్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నిజాయితీకి మారుపేరు’ అనేది ఉప శీర్షిక. జూలై 4 అల్లూరి సీతారామరాజు 125 జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ ‘అల్లూరి’ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ”ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్.. పోలీస్ బయల్దేరాడు రా” అనే డైలాగ్ తో టీజర్ లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు శ్రీవిష్ణు. నేరస్తులని వెంటాడటం, వారికి పోలీస్ పవర్ చూపించడం, నక్సల్ స్థావరానికి వెళ్లి ‘ఎస్.ఐ. అల్లూరి సీతారామరాజు’ అని తనని తాను పరిచయం చేసుకొని తెగువ చూపడం ఆసక్తికరంగా వుంది. శ్రీవిష్ణు, అల్లూరి పాత్రలో డైనమిక్ అండ్ పవర్ ఫుల్ గా కనిపించారు. ఈ పాత్ర కోసం శ్రీవిష్ణు పూర్తి ట్రాన్సఫర్మేషన్ కావడం టీజర్లో విశేషంగా కనిపిస్తోంది. దర్శకుడు ప్రదీప్ వర్మ అల్లూరి పాత్రకు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ మూడ్ సెట్ చేసింది. టీజర్ ని చూస్తే ‘అల్లూరి’ మూవీ గ్రిప్పింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఉండనుందని అర్ధమౌతుంది.
టీజర్ రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు మాట్లాడుతూ, ”అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా వుంది. దర్శకుడు ప్రదీప్ తో నాలుగేళ్ళుగా ప్రయాణిస్తున్నా. అల్లూరిలో వుండే ఆవేశం దర్శకుడు ప్రదీప్ లో చూశాను. సైనికులు, పోలీసులు, వైద్యులు.. ఈ ముగ్గురిని రియల్ హీరోస్ గా చూస్తా. ఇలాంటి పాత్రలు వచ్చినపుడు చాలా నిజాయితీ వుండి నచ్చితేనే చేయాలని అనుకునేవాడిని. సరిగ్గా ఇదే సమయంలో నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ పాత్ర దొరికింది. ఈ పాత్ర చేసిన తర్వాత నేను ఎందుకు పోలీసు అవ్వలేదని అనుకున్నాను. నా కెరీర్ బెక్కెం వేణుగోపాల్ గారితోనే మొదలైయింది. ఆయనతోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నా. ఇది ఫిక్షనల్ బయోపిక్. రియల్ గా జరిగిన సంఘటనని తీసుకొని ఒక కథగా చేశాం. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. నేటి సమాజానికి కావాల్సిన సినిమా ఇది” అని అన్నారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ”ఈ రోజు నుండి సినిమా విడుదలయ్యేంత వరకూ పబ్లిసిటీ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతాయి. మేము నిర్మించిన చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ‘అల్లూరి’ చాలా స్పెషల్ మూవీ. అన్ని కమర్షియల్ హంగులు వున్న గొప్ప సినిమాగా ఇది ఉండబోతుంది. ఒక గొప్ప సినిమా తీశాననే తృప్తిని ఈ మూవీ కలిగించింది” అని చెప్పారు. దర్శకుడు ప్రదీప్ వర్మ మాట్లాడుతూ, ”నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్ ఇది. 16 ఏళ్ళ వృత్తి, వ్యక్తిగత జీవితంలో నిజాయితీ గల పోలీసు అధికారి ఏం చేశారనేది తెలియచేయడం కోసం ఆయన ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాం. ఈ సినిమాని చూసిన అందరికీ పోలీసులపై చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులు ఖచ్చితంగా పోలీసులకు సెల్యూట్ చేస్తారు. ఈ చిత్రం విషయంలో నాకు మొదటి నుండి ఎంతో ప్రోత్సహించిన హీరో నారా రోహిత్ గారికి కృతజ్ఞతలు” అని తెలిపారు. నటుడు శివాజీ మాట్లాడుతూ, ”బెక్కెం వేణుగోపాల్ నాకు మంచి మిత్రులు. మేం ఎంతో కాలంగా కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఆయన ప్రతి కథ నాకు చెప్తారు. ‘అల్లూరి’ కథ కూడా చెప్పారు. నిర్మాత, డిస్ట్రిబ్యుటర్ ప్రశాంతంగా బతకాల్సిన సినిమా ఇది. దర్శకుడు అద్భుతమైన కథని తయారు చేసుకున్నారు. పోలీసు కథలకు ఎప్పుడూ పవర్ వుంటుంది. ‘అల్లూరి’లో కథలో కూడా సూపర్ పవర్ వుంది. శ్రీవిష్ణు ఎప్పుడూ కొత్త కథలుచేయడానికి ఇష్టపడతాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా ఖచ్చితంగా కొత్తదనం ఫీలౌతారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది”అని అన్నారు.
ఒక్క పాట మినహా పూర్తైన ఈ సినిమాలో కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని ప్రధాన పాత్రలను పోషించారు.