(డిసెంబర్ 14తో ‘ఆవారా’కు 70 ఏళ్ళు పూర్తి)
నటునిగానే కాదు, దర్శకునిగానూ రాజ్ కపూర్ తనదైన బాణీ పలికించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలలో సామాన్యుని పక్షం నిలచి, అతని చుట్టూ అలుముకున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. పురాణగాథల్లో భార్యను అనుమానించి, పరిత్యజించిన వైనాన్ని ప్రశ్నిస్తూ, అలా బయటకు పంపిన భార్య, ఆమె పిల్లల పరిస్థితి ఏంటి అని అడుగుతూ రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఆవారా’. ఈ సినిమాలో నటించి, దర్శకత్వం వహించే సమయానికి ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలు. తన పుట్టినరోజయిన డిసెంబర్ 14 నే ఈ సినిమాను 1951లో విడుదల చేశారు రాజ్ కపూర్. ఈ సినిమా మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ విశేషాదరణ చూరగొంది.
‘మంచివాళ్ళకు మంచివాళ్ళే పుడతారు. చెడ్డవారి కడుపున చెడ్డవారే జన్మిస్తారు’ అనే గుడ్డి నమ్మకంతో ఉన్న న్యాయమూర్తి రఘునాథ్, జగ్గా అనే రౌడీ, ఓ స్త్రీని మానభంగం చేశాడన్న నెపంతో శిక్ష వేస్తాడు. దాంతో జగ్గా పగబడతాడు. జైలు నుండి వచ్చిన జగ్గా, జడ్జి రఘునాథ్ పై పగతీర్చుకోవాలని భావిస్తాడు. ఆయన భార్య లీలాను ఎత్తుకుపోయి బంధిస్తాడు. ఆమె గర్భవతి అని తెలిసి, కనికరించి, నాలుగు రోజుల తరువాత వదిలేస్తాడు. కానీ, ఆమెను మళ్ళీ స్వీకరించడానికి రఘునాథ్ మనసు అంగీకరించదు. ఆమెను నిర్దాక్షిణ్యంగా బయటకు తోసేస్తాడు. బయట పడ్డ లీలా ఓ మగబిడ్డకు జన్మనిస్తుంది. తల్లి, కొడుకు రాజ్ పేదరికంలో బతుకుతుంటారు. రాజ్ కు స్కూల్ లో రీటా అనే స్నేహితురాలు ఉంటుంది. ఆమె కొంతకాలానికి వేరే ఊరికి పోతుంది. తరువాత రాజ్ చదువుకు స్వస్తి చెప్పి, ఏదైనా చేయాలనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో జగ్గా పరిచయం అవుతాడు. రాజ్ అతని పర్యవేక్షణలో దొంగ అవుతాడు. ఓ సారి, దోపిడీ చేసి తప్పించుకొనే ప్రయత్నంలో ఓ అమ్మాయి పర్సు కొట్టేస్తాడు. అందులో కారు తాళాలు లేకపోవడంతో తిరిగి ఆమెకు ఇచ్చేస్తాడు. అతను మంచివాడని ఆమె భావిస్తుంది. ఆ రోజు ఆమె పుట్టినరోజు, ఆమె వద్ద ఉన్న ఫోటో ఆధారంగా, ఆ అమ్మాయి తన చిన్ననాటి నేస్తం రీటా అని తెలుసుకుంటాడు రాజ్.
రాజ్ నీతిగా బతకాలనుకుంటాడు. కానీ, అతను దొంగ అని తెలిసిన వారు ఉద్యోగం నుండి తీసేస్తారు. రీటాతో పరిచయం పెరుగుతుంది. తన పుట్టినరోజుకు పిలుస్తుంది. ఆమె మరెవరో కాదు, రాజ్ తండ్రి రఘునాథ్ మేనకోడలు. పిల్లలు లేని ఆయన రీటాను పెంచుకుంటూ ఉంటాడు. రఘునాథ్, రాజ్ ను అవమానిస్తాడు. దాంతో డబ్బు కోసం మళ్ళీ జగ్గా దగ్గరకు వెళతాడు. అతను మరిన్ని నేరాలు చేయమని ప్రోత్సహిస్తాడు. రాజ్ నేరాలు చేస్తున్నాడని తల్లి తెలుసుకుంటుంది. ఈ లోకంలో బతకడానికి డబ్బే ప్రధానం అంటాడు రాజ్. ఆమె అతనికి అసలు విషయం చెబుతుంది. రాజ్ తండ్రి రఘునాథ్ పై మరింత కోపం పెంచుకుంటాడు. రాజ్, రీటాను విడదీయాలని చూస్తాడు రఘునాథ్. రాజ్ ను జైలుకు వెళ్ళేలా చేస్తాడు. రాజ్ జైలు నుండి తప్పించుకు వచ్చి, తండ్రిని చంపి పగతీర్చుకోవాలనుకుంటాడు. రీటా వారిస్తుంది. వేరే కోర్టులో అతని కేసు బదిలీ చేసి, అతని తరపున లాయర్ గా వాదిస్తుంది రీటా. ఆమెనే గెలుస్తుంది. అయితే రాజ్ మాత్రం తాను మంచి మనిషిని కాను అని చెబుతాడు. తన లాంటి ఎందరో పేదపిల్లలు, గత్యంతరం లేక నేరస్థులుగా మారుతున్నారని, అలాంటివారిని కాపాడి సన్మార్గంలో పెట్టమని కోర్టును వేడుకుంటాడు. రాజ్ కు మూడేళ్ళు శిక్ష పడుతుంది. అతను వెళ్తూఉండగా, తండ్రి రఘునాథ్ వెళ్ళి రాజ్ ను తన కొడుకుగా అంగీకరించడమే కాదు, తనను క్షమించమని వేడుకుంటాడు. జైలులో ఉన్న రాజ్ ను రీటా కలుసుకుంటుంది. విడుదలై వచ్చిన తరువాత తాను మారతానని, తమకు మంచి పిల్లలు పుడతారని ఇద్దరూ కన్నీళ్ల మధ్య ఆశిస్తారు. దాంతో కథ ముగుస్తుంది.
అసలు కథనే కోర్టులో రాజ్ ను విచారించడంతో మొదలవుతుంది. ఆ రోజుల్లో ఆ ఎత్తుగడ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో పాటల చిత్రీకరణలో రాజ్ కపూర్ కొత్త పోకడలు పోయారు. ముఖ్యంగా “ఏక్ దో తీన్…” పాట చిత్రీకరణలో సంగీతంలోని హెచ్చు తగ్గులు పాట పాడుతున్న నర్తకి కదలికలకు అనుగుణంగా సాగుతుంది. ఆమె కెమెరాకు దగ్గరగా వచ్చిన సమయంలో వాయిస్ హెచ్చుగా వినిపిస్తుంది. దూరంగా జరిగినప్పుడు తగ్గుతుంది. ఈ ప్రయోగం అప్పట్లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని “ఘర్ ఆయా మేరా పర్దేశీ…”, “దమ్ భర్ జో ఉదర్ ముహ్ పేరే…”, “తేరే బినా ఆగ్ యే చాంద్…”, “నయ్యా మేరీ మంజ్ దార్…”, “హమ్ తుఝ్ సే మొహబ్బత్ కర్కే…”, “ఏక్ బేవఫా సే ప్యార్ కియా…”, “అబ్ రాత్ గుజర్నే వాలీ హై..”, “జబ్ సే బాలమ్ ఘర్ ఆయే…” పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్నిటినీ మించి టైటిల్ సాంగ్…” ఆవారా హూ…” ఆబాలగోపాలాన్నీ మురిపించింది. ఈ పాటలను శైలేంద్ర, హస్రత్ జైపురి రాశారు. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ రచన చేశారు.
ఈ చిత్రంలో రాజ్ కపూర్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ ఆయనకు తండ్రిగానే నటించడం విశేషం. రాజ్ కు అచ్చివచ్చిన నాయిక నర్గీస్ ఇందులోనూ హీరోయిన్. మిగిలిన పాత్రల్లో లీలా చిట్నిస్, లీలా మిశ్రా, బి.ఎమ్. వ్యాస్, కె.ఎన్.సింగ్, కుకూ, హనీ ఓ బ్రెయిన్, ఓం ప్రకాశ్ నటించారు. రాజ్ తాత, అంటే పృథ్వీరాజ్ కపూర్ తండ్రి బసేశ్వరనాథ్ కపూర్ ఈ సినిమాలో ఆరంభంలోనే జడ్డి పాత్రలో కనిపిస్తారు. కోర్టు సీన్ లోనే రాజ్, ఆయన తండ్రి పృథ్వీరాజ్, ఆయన నాన్న బసేశ్వర్ నాథ్ కనిపించడం విశేషం!
ఈ సినిమా విడుదలయిన రోజు నుంచే జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలచి, కలెక్షన్ల వర్షం కురిపించింది. రాజ్ కపూర్ ఈ సినిమాతోనే చార్లీ చాప్లిన్ ను విశేషంగా అనుకరించి, ఇండియన్ చాప్లిన్ అనిపించుకున్నారు. సోవియట్ యూనియన్, ఈస్ట్ ఏసియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ‘ఆవారా’ విశేషాదరణ చూరగొంది. రష్యా వీధుల్లో ఈ సినిమాలోని పాటలను వల్లిస్తూ అక్కడివారు సంచరించడం చూసి, అప్పట్లో మన భారతీయులు ఎంతగానో ఆనందించేవారు. ఆ రోజుల్లోనే విదేశాలలో వసూళ్ళ వర్షం కురిపించిన ‘ఆవారా’ టాప్ ఇండియన్ మూవీస్ లో ఎవరు జాబితా తయారు చేసినా, తప్పకుండా చోటు సంపాదించుకుంటూనే ఉంది.
ఈ సినిమా స్ఫూర్తితో అనేక దక్షిణాది చిత్రాలు రూపొందాయి. యన్టీఆర్ ‘మంచిమనిషి’ని చూస్తే, ఇందులోని పలు సన్నివేశాలు గుర్తుకు రాకమానవు. ఈ సినిమాలోని డ్రీమ్ సీక్వెన్స్ స్ఫూర్తితో ఈ నాటికీ అనేక చిత్రాలలో పాటలు, సన్నివేశాలు రూపొందుతూనే ఉండడం విశేషం. ఈ సీక్వెన్స్ లోనే “తేరే బినా…ఆగ్…” సాంగ్ వస్తుంది. ఈ కీలకమైన పాటలో మన్నాడే గళవిన్యాసాలు, లతా మంగేష్కర్ గానం సైతం ఆకట్టుకుంటాయి. మిగిలిన పాటల్లో రాజ్ కపూర్ కు ముకేశ్ నేపథ్యం పాడి అలరించారు. ఈ సీక్వెన్స్ లోనే చివరలో “ఘర్ ఆయా మేరే పర్దేశీ…” పాట కూడా కనిపిస్తుంది. ఇప్పుడు చూసినా అందులో కొత్తదనం ఉందని అనిపించక మానదు.
ఈ సినిమాలో ‘అనాథలు నేరస్థులుగా మారడానికి సమాజమే కారణం’ అంటూ రాజ్ కపూర్ ఎలుగెత్తి చాటారు. పుట్టుకతో ఎవరూ నేరస్థులు కారని, పరిస్థితులే అనాథలను నేరస్థులుగా మారుస్తాయని చెప్పారు. 70 ఏళ్ళ తరువాత ఇప్పటికీ మనదేశంలో అలాంటి పరిస్థితులు తారసపడుతూనే ఉండడం గమనార్హం!