Sita Ramam: కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ వందరోజులు పూర్తి చేసుకుంది. థియేటర్లలో సినిమాలు రెండు, మూడు వారాలు ఆడటమే గగనమైపోయిన ఈ రోజుల్లో ‘విక్రమ్’తో కమల్ మరోసారి తన స్టామినాను చూపించాడు. ఇప్పుడు తెలుగులోనూ ఆ ట్రెండ్ మొదలైంది. గత నెల 5వ తేదీ విడుదలైన ‘సీతారామం’ మూవీ కూడా అర్థ శతదినోత్సవం దిశగా సాగిపోతోంది. విశేషం ఏమంటే.. ‘సీతారామం’ థియేటర్లలో విడుదలైప్పుడు ఎలాంటి స్పందనైతే వచ్చిందో.. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయినప్పుడూ అదే స్థాయి స్పందన వచ్చింది. థియేటర్లలో ఇంతవరకూ చూడనివారు ఇప్పుడు ఓటీటీలో చూస్తున్నారు. థియేటర్లలోనూ ఇప్పటికే చూసిన వాళ్ళు మరోసారి ఓటీటీలో వీక్షిస్తున్నారు.
Read Also: Krishna Vrinda Vihari: నాగశౌర్య పాదయాత్ర దేనికోసం?
ఈ ఆనందాన్ని చిత్ర బృందం కూడా సినీ అభిమానులతో పంచుకుంటోంది. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ‘మా సీతారామం, మీ సీతారామం, మన సీతారామం’ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. చిత్రం ఏమంటే.. ‘సీతారామం’ వంటి విజువల్ వండర్ మూవీని ఓటీటీలో చూసిన వారికి దీన్ని థియేటర్‌లో చూస్తే ఇంకా బాగుంటుందనిపించే ఛాన్స్ ఉంది. అందుకే థియేటర్లలోనూ ఈ మూవీ ఇంకా నడుస్తోంది. సో.. ఆ థియేట్రికల్ అనుభూతిని పొందమని అశ్వనీదత్ కూడా కోరుతున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను జనం ఎప్పటికీ ఆదరిస్తారని, అక్కున చేర్చుకుంటారని ‘సీతారామం’ మరోసారి నిరూపించింది. అంతేకాదు.. అందులో కీలక పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, దర్శకుడు హను రాఘవపూడిని కూడా ప్రేక్షకులు ఆకాశానికెత్తేస్తుండటం మరో విశేషం.