Shruti Haasan Hikes Her Remuneration: ‘క్రాక్’ సినిమా రిలీజ్‌కి ముందు వరకు శృతి హాసన్ కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. అంతకుముందు ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం, ఎక్కువ ఆఫర్లు రాకపోవడం, వ్యక్తిగత జీవితంలో ఆమె లీనమైపోవడంతో.. శృతి ఇక సినిమాల్లో కొనసాగడం కష్టమేనని భావించారు. కానీ.. ‘క్రాక్’ తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోయాయి. ఆ చిత్రంతో శృతి కెరీర్ అనూహ్య మలుపు తిరిగింది. వరుసగా భారీ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో తీరిక సమయం లేకుండా ఫుల్ బిజీగా గడుపుతోంది.
ఇంకేముంది.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు, తనకిప్పుడు తిరిగి డిమాండ్ పెరగడంతో శృతి తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందట! బాలయ్య, చిరంజీవిలతో జోడీ కట్టిన సినిమాలకు గాను ఈ అమ్మడు రూ. రెండు కోట్ల వరకు అమౌంట్ తీసుకుంటోందట! అయితే.. ప్రభాస్ సరసన నటిస్తున్న ‘సలార్’కి మాత్రం రూ. 3 కోట్లు అందుకుంటోందని సమాచారం. అది పాన్ ఇండియా సినిమా కావడం, అందులో తన పాత్ర కోసం కాస్త ఎక్కువే కసరత్తు చేయాల్సి వస్తుండడంతో.. శృతి మిగితా చిత్రాల కంటే ‘సలార్’కి ఎక్కువ డబ్బు తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాతో శృతికి మరింత క్రేజ్ వచ్చిపడుతుంది కాబట్టి, అప్పుడు ఆమె పారితోషికం ఫిగర్ రూ. 5 కోట్లకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కాగా.. సలార్‌తో శృతి హాసన్ ‘ఆద్య’ అనే రిపోర్టర్ పాత్రలో కనిపించనుంది. దీంతోపాటు.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న NBK107లో బాలయ్య సరసన శృతి హీరోయిన్‌గా నటిస్తోంది. అటు.. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోనూ కథానాయిక పాత్ర పోషిస్తోంది. ఇవన్నీ భారీ ప్రాజెక్టులే కాబట్టి.. వీటి విడుదల తర్వాత శృతి క్రేజ్ ఆకాశాన్నంటుతుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.