శ్రియ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు పులకించి పోతారు. ఒకటా రెండా ఎన్నెన్నో వైవిధ్యమైన పాత్రల్లో అందచందాలతో అలరించారు శ్రియ. టాప్ స్టార్స్ మొదలు అప్ కమింగ్ హీరోస్ తోనూ చిందేసి కనువిందు చేశారు శ్రియ. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు ప్రాణం పోసే ప్రయత్నంలోనే ఉన్నారామె.
శ్రియ 1982 సెప్టెంబర్ 11న హరిద్వార్ లో జన్మించారు. ఆమె బాల్యమంతా ఢిల్లీలోనే సాగింది. శ్రియ మొదట్లో మోడలింగ్ లో రాణించారు. తెలుగు సినిమా ‘ఇష్టం’తోనే తెరంగేట్రం చేశారు. ఆ సినిమాను జనం అంతగా ఇష్టపడక పోయినా, ఆమె అందాన్ని మాత్రం ఆరాధించారు. దాంతో అవకాశాలు శ్రియ తలుపు తట్టాయి.
రెండో చిత్రం’సంతోషం’లోనే నాగార్జునతో జోడీ కట్టిన శ్రియ, వెంటనే బాలకృష్ణ సరసన ‘చెన్నకేశవ రెడ్డి’లో నటించేశారు. ఆ పై చిరంజీవితో కలసి ‘ఠాగూర్’లో చిందేశారు. వెంకటేశ్ తో శ్రియ నటించిన ‘సుభాష్ చంద్రబోస్’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ తో ‘బాలు’లోనూ, ప్రభాస్ తో ‘ఛత్రపతి’లోనూ, జూ.యన్టీఆర్ తో ‘నా అల్లుడు’లోనూ, మహేశ్ తో ‘అర్జున్’లోనూ శ్రియ మురిపించారు. టాప్ స్టార్స్ తో తకధిమితై అన్న శ్రియ, స్టార్ హీరోస్ తోనే నటిస్తానని భీష్మించుకోలేదు. తనకు సబ్జెక్ట్ నచ్చితే చాలు, వెంటనే ఓకే చెప్పేసేవారు. అలా తరుణ్ తో ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను’ చిత్రాలలోనూ, ఉదయ్ కిరణ్ తో ‘నీకు నేను నాకు నువ్వు’లోనూ, రాజాతో ‘మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు’లోనూ, వేణుతో ‘సదా మీ సేవలో’లోనూ శ్రియ నటించారు. అంతెందుకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో కౌశిక్ దర్బాతోనూ , ‘పవిత్ర’లో కౌశిక్ బాబుతోనూ అభినయించి ఆకట్టుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి ‘శివాజీ: ద బాస్’లో శ్రియ అందం చిందేసింది. మోహన్ బాబుతో ‘గాయత్రి’లో కీలక పాత్ర పోషించారామె.
కేవలం హీరోయిన్ గానే కనిపిస్తాననీ శ్రియ మడి కట్టుకోలేదు. కొన్ని చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లోనూ నర్తించారు. స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఎవరితో నటించినా సరే, తన నాజూకు షోకులను ఎంచక్కా కాపాడుకుంటూ సాగారు శ్రియ. ఆమెకు నటిగా నాగార్జున ‘నేనున్నాను’ మంచి పేరు సంపాదించి పెట్టింది. వెంకటేశ్ ‘తులసి’లో “నే చుకు చుకు బండినిరో…” పాటలో చిందేసి కనువిందు చేసింది. హిందీ చిత్రసీమలోనూ శ్రియ సోయగం మురిపించింది. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ శ్రియ అందం బంధం వేసింది. “ది అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్, కుకింగ్ విత్ స్టెల్లా, మిడ్ నైట్స్ చిల్ర్డన్” వంటి ఆంగ్ల చిత్రాల్లోనూ శ్రియ నటించారు. శ్రియలోని వైవిధ్యాన్ని అభిమానించిన వారందరూ మళ్ళీ ఆమెతో పనిచేయడానికి ఇష్టపడ్డారు. అందువల్లే బాలకృష్ణ తన నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో నాయికగా శ్రియనే ఎంచుకున్నారు. తరువాత బాలయ్యతో కలసి ‘పైసా వసూల్’లోనూ శ్రియ నటించారు. యన్టీఆర్ బయోపిక్ ‘యన్టీఆర్ కథానాయకుడు’లో “చిత్రం భళారే విచిత్రం…” పాటలో బాలకృష్ణ సరసన కాసేపు కనిపించారామె.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఛత్రపతి’లో అందాలతో అలరించిన శ్రియ, ఆయన ‘ట్రిపుల్ ఆర్’లోనూ కీలక పాత్ర పోషించారు.
తన రష్యన్ బోయ్ ఫ్రెండ్ ఆండ్రే కొశ్చీవ్ ను 2018 మార్చి 12న పెళ్ళాడారు శ్రియ. వారికి ఓ పాప, పేరు రాధ. ఓ వైపు తన సినిమాలతోనూ, యాడ్స్ తోనూ బిజీగా ఉండే శ్రియ, సోషల్ వర్క్ తోనూ హుషారుగా సాగుతుంటారు. ప్రస్తుతం శ్రియ ‘దృశ్యం-2’ హిందీ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. “మ్యూజిక్ స్కూల్, తడ్కా” వంటి హిందీ చిత్రాలలోనూ, ‘కబ్జా’ అనే కన్నడ సినిమాలోనూ, ‘సండక్కారి’ అనే తమిళ మూవీలోనూ ఆమె నటిస్తున్నారు. శ్రియ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.