Shekar Master: టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టర్. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు, తమిళ్ హీరోలు అని తేడా లేకుండా అందరికి ఊర మాస్ స్టెప్స్ ను నేర్పించి అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు ఒకేసారి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ను పట్టేసాడు శేఖర్ మాస్టర్. మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలౌతుండగా, ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వాల్తేరు వీరయ్యలోని అన్ని పాటలకు (సింగిల్ కార్డ్) కొరియోగ్రఫీ అందించారు విజే శేఖర్ మాస్టర్. అలాగే వీరసింహారెడ్డిలోని రెండు పాటలకు (సుగుణ సుందరి, మా బావ మనోభావాలు) కొరియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా విలేఖరు సమావేశంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల విశేషాలని పంచుకున్నారు.
“పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉంటుంది.. కానీ, ఈ సినిమాలు చేస్తున్నప్పుడు ఒత్తిడికి గురికాలేదు. రెండు సినిమాలు చేస్తున్నప్పుడు సంక్రాంతికి వస్తాయని తెలీదు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేశాను. ఇప్పుడు రెండు సినిమాల పాటలు, లిరికల్ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి విధుల అవుతుంటే మాత్రం భయమేస్తోంది. పెద్ద హీరోలు, సినిమాలు అనేవి ఏమి మైండ్ లో ఉండవు.. సాంగ్ కు ఏం కావాలో దాని ప్రకారం వెళ్తాము. తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి స్టెప్స్, మూమెంట్స్ అయితే బావుంటాయో అనేది మౌల్డ్ చేసుకుంటూ వెళ్తాం. అంతే..ఇంతకు మించి ఎక్కువ ఆలోచించినా సరిగ్గా ఫోకస్ చేయలేం. ఇక చిరు, బాలయ్య లో ఉన్న యూనిక్ క్వాలిటీ డెడికేషన్. ఒక మూమెంట్ వస్తే అది పూర్తయ్యేవరకూ రిలాక్స్ అవ్వరు. ఆ డెడికేషన్ ఇద్దరిలో చూశా. అలాగే టైమింగ్ సెన్స్. వారిద్దరి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయాలివి. ఈ హీరోలకు ఇలాంటి స్టెప్స్ ఇవ్వాలని ఏం ఉండదు. వారి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు స్టెప్స్ ఉంటాయి.
వాల్తేరు వీరయ్యలో ఐదు పాటలు వున్నాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకం. ప్రతి పాటని డిఫరెంట్ గా చేశాం. ఈ విషయంలో కాస్త ఎక్కువగానే కష్టపడ్డాం. ఒకటి మాస్, మరొకరి క్లాస్ లో మాస్, మరొకటి ఫుల్ మెలోడి.. ఇలా చేయడానికి కొంచెం ఎక్కువ వర్క్ అవుట్ చేయాలి. వాల్తేరు వీరయ్య మెలోడి పాట కోసం ఫారిన్ వెళ్లాం. అక్కడ మైనస్ 10 డిగ్రీల వద్ద పని చేశాం. థర్మల్స్, జర్కిన్స్, బూట్స్, గ్లౌజ్స్, మంకీ క్యాప్ అన్నీ వేసుకున్నప్పటికీ అక్కడ నిలబడలేం. అలాంటిది హీరో, హీరోయిన్ కి షూటింగ్ లో ఇవేవీ వుండవు. మామూలు డ్రెస్ లో వుండాలి. నడుస్తుంటేనే కాళ్ళు ఫ్రీజ్ అయిపోతాయి. చేతులో ముడుచుకుపోతాయి. అలాంటింది ఆ చలిలో చిరంజీవి గారు, శ్రుతి హాసన్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. డ్యాన్సులు అద్భుతంగా వచ్చాయి. అలాగే వీరసింహా రెడ్డి సుగుణ సుందరి పాట కోసం టర్కీ వెళ్లాం. అక్కడ ఫుల్ ఎండలు. వాల్తేరు వీరయ్య చలి అయితే దానికి పూర్తి భిన్నంగా వీరసింహారెడ్డి సుగుణ సుందరి పాటని భయంకరమైన ఎండలో షూట్ చేశాం. విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ఇందులో బెల్ట్, నాడ స్టెప్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కోసం స్పెషల్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశా”మని చెప్పుకొచ్చాడు.