సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే వారందరిలోకీ షావుకారు జానకి స్థానం ప్రత్యేకమైనది. నటిగానే కాదు వ్యక్తిత్వంలోనూ షావుకారు జానకి తనదైన శైలిని ప్రదర్శించారు. స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉండే వస్తువు కాదని, ఆ రోజుల్లోనే నిరూపించిన సాహసవంతురాలు జానకి! పెళ్ళయి, ఓ బిడ్డ తల్లయిన తరువాత కూడా తన స్వశక్తితో ముందుకు సాగాలని భావించారామె. అందుకు చిత్రసీమను వేదికగా ఎంచుకోవడం నిస్సందేహంగా సాహసమే! ఆ రోజుల్లో అయితే మరింత సాహసం అనే చెప్పాలి. ఇక నటిగానూ తనదైన బాణీ పలికిస్తూ మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనూ మెప్పించారు జానకి.
జానకి 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు. ఆమె తండ్రి పేరు టి.వెంకోజీరావు, తల్లి సచీదేవి. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం అస్సాములో ఉన్నారు. అక్కడే జానకి విద్య సాగింది. తరువాత జానకి 14 ఏళ్ళ ప్రాయంలోనే మద్రాసు చేరారు. అప్పట్లో అక్కడి ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్ గా పనిచేశారు. అదే సమయంలో కొన్ని నాటకాల్లోనూ ఆమె నటించారు. కొంతకాలానికే ఆమెకు పెళ్ళయింది.
కుటుంబ పరిస్థితుల కారణంగా 18 ఏళ్ళ వయసులో ‘షావుకారు’ చిత్రంలో సుబ్బులు పాత్రలో నటింరామె. తొలి చిత్రంలోనే గోవిందరాజుల సుబ్బారావు, శ్రీవాత్సవ, వంగర, రేలంగి వంటి మేటి నటులతో పోటీపడి నటించారు జానకి. ఆ చిత్రంలోనే మహానటుడు యన్టీఆర్ తొలిసారి హీరోగా నటించడం విశేషం! రామారావుకు జానకి తొలి హీరోయిన్. అలాగే ఆమెకు ఆయనే తొలి హీరో. ఇక ఆ సినిమా పేరే జానకి ఇంటిపేరుగామారిపోయింది. ‘షావుకారు’ జానకిగా చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ సాగారామె.
తెలుగులో కంటే తమిళంలో జానకి కథానాయికగా ఎక్కువ చిత్రాలలో నటించడం విశేషం! తెలుగులో యన్టీఆర్ సరసన జానకి ఎక్కువ సినిమాల్లో కనిపించారు. వారిద్దరూ నటించిన “వద్దంటే డబ్బు, జయం మనదే, కన్యాశుల్కం, రేచుక్క-పగటి చుక్క, పెంపుడు కూతురు” వంటి చిత్రాలు విజయం సాధించాయి. వీటితో పాటు యన్టీఆర్ హీరోగా రూపొందిన “సవతి కొడుకు, చెరపుకురా చెడేవు, అన్న-తమ్ముడు, కాడెద్దులు ఎకరం నేల” వంటి సినిమాల్లోనూ జానకి కీలక పాత్రలు ధరించారు. యన్టీఆర్ తొలి సొంత చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’లో కీలకమైన పాత్ర పోషించారు. అందులోనే తొలిసారి ఆమె చెల్లెలు కృష్ణకుమారి, రామారావుకు జోడీగా నటించారు. యన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమాలోనూ, ఆయన నిర్మించిన మొదటి చిత్రంలోనూ జానకిని ఎంపిక చేసుకోవడం వెనుక యన్టీఆర్ కు ఆమె అంటే ఓ సెంటిమెంట్ ఉండడమే కారణం. ఇక యన్టీఆర్ సొంత సంస్థ ‘యన్.ఏ.టి.’ పతాకం బ్యానర్ లో శ్రీవేంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని మధ్యలో పెట్టి, కుడివైపున లక్ష్మీదేవిగా జానకినే కూర్చోబెట్టడం కూడా విశేషమే! యన్టీఆర్ తన తనయుడు బాలకృష్ణను ‘తాతమ్మకల’తో చిత్రసీమకు పరిచయం చేశారు.ఆ సినిమా తరువాత ‘రామ్-రహీమ్’లో నటింప చేశారు. అందులోనూ, ఆ తరువాత వచ్చిన బాలయ్య చిత్రం ‘వేములవాడ భీమకవి’లోనూ బాలకృష్ణకు తల్లిగా నటించారు జానకి.
ఇక ఏయన్నార్ సరసన జానకి నటించిన “రోజులు మారాయి, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి, మంచి కుటుంబం, అక్కాచెల్లెలు” మంచి ఆదరణ పొందాయి. వీటిలో ‘రోజులు మారాయి’ ఒక్క చిత్రంలోనే జానకి సోలో హీరోయిన్. మిగిలిన సినిమాల్లో ఇతరులు కూడా నాయికలుగా కనిపించారు. ‘అక్కాచెల్లెలు’లో జానకిపై చిత్రీకరించిన “పాండవులు పాండవులు తుమ్మెదా…పంచపాండవులోయమ్మా తుమ్మెదా…” పాట ఆ రోజుల్లో ఓ ఊపు ఊపింది. ‘నాగులచవితి’లో నాగదేవతగా జానకి అభినయం జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
తెలుగులో షావుకారు జానకిని అనుకున్న పాత్రల్లో ఆమె చెల్లెలు కృష్ణకుమారిని ఎంచుకోవడం మొదలు పెట్టారు సినీజనం. దాంతో తమిళ చిత్రాలపై దృష్టిని కేంద్రీకరించారు జానకి. అందుకు తగ్గట్టుగానే ఆమెకు ఇతర భాషల్లో మంచి పాత్రలు దక్కాయి.
తమిళంలో శివాజీగణేశన్, ఎమ్జీఆర్ తోనూ, మళయాళంలో ప్రేమ్ నజీర్ సరసన, కన్నడలో రాజ్ కుమార్ తోనూ జానకి నటించారు. తమిళంలో శివాజీకి హిట్ పెయిర్ గా నిలిచారామె. ఇక దర్శకుడు కె.బాలచందర్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం! వారిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. బెంగాలీ చిత్రం ‘ఉత్తర్ ఫల్గుణీ’ని జానకి మనసుకు నచ్చింది. ఆ సినిమా రీమేక్ రైట్స్ కొని, కె.బాలచందర్ దర్శకత్వంలో ‘కావియ తలైవి’గా జానకి నిర్మించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేక పోయింది. అయితే నటిగా సంతృప్తి దక్కిందని జానకి చెబుతారు. ‘షావుకారు’ జానకి పేరుకు తగ్గట్టుగానే ఆస్తులు సంపాదించారు. తన తరం నాయికలలాగా లక్షలు సంపాదించక పోయినా, తన సంపాదనతోనే పలు ఆస్తులు కొనుగోలు చేశారు. తరువాతి రోజుల్లో అవే ఊహించని ఆస్తులుగా మారాయి. మద్రాసులో షావుకారు జానకి తన అభిరుచికి తగ్గట్టుగా ఓ భవంతిని నిర్మించుకున్నారు. ఆ ఇంటిలో అనేక తెలుగు, తమిళ చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం విశేషం!
హీరోయిన్ వేషాలు తగ్గగానే జానకి కేరెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ తనకు తగ్గ పాత్రల్లో ఆమె అలరించారు. ‘తాయారమ్మ-బంగారయ్య, పార్వతిపరమేశ్వరులు, సంసారం ఓ చదరంగం” వంటి చిత్రాలలో కీలకమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు జానకి. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఆమె సిద్ధంగానే ఉన్నారు. ఈ యేడాది ‘అన్నీ మంచి శకునములే’ అనే చిత్రంలో జానకి నటించారు.
ప్రస్తుతం బెంగళూరులో తన సొంత నివాసంలో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు జానకి. 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా, జానకి ఇప్పటికీ చురుగ్గానే ఉండడం విశేషం! ఆమె మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.