బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించిన “జెర్సీ” మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. నాని హీరోగా నటించిన “జెర్సీ” తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో “జెర్సీ” చిత్రం షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా హిందీలో రీమేక్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తో మరోసారి తన సత్తా చాటిన షాహిద్ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమా ‘జెర్సీ’ని హిందీలోనూ అదే పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రం కొన్ని నెలల క్రితమే విడుదలకు సిద్ధమైంది. అయితే కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేశారు. ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయబోతున్నామని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. అయితే చివరి క్షణంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 22న భారీగా విడుదల కానుంది.
Read Also : Akhil Akkineni : వైజాగ్ లో “ఏజెంట్”కు గ్రాండ్ వెల్కమ్
అయితే హిందీ “జెర్సీ” మూవీ రిలీజ్ వాయిదా పడడానికి కారణం సౌత్ సినిమాలే. దళపతి విజయ్ “బీస్ట్”, యష్ “కేజీఎఫ్ 2” సినిమాలు ఒకరోజు గ్యాప్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొనబోతున్నాయి. ఏప్రిల్ 13న “బీస్ట్” వస్తే, 14నే “కేజీఎఫ్ 2” రిలీజ్ కానుంది. రెండు సినిమాలూ పాన్ ఇండియానే. పైగా భారీ అంచనాలున్న సినిమాలు. ఈ రెండు సినిమాల మధ్య “జెర్సీ” విడుదలైతే మేకర్స్ నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు “జెర్సీ” మూవీ విడుదలను మరోసారి వాయిదా వేయక తప్పలేదు. ఏదేమైనా నిర్మాతలు తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పొచ్చు.
ఒరిజినల్ ‘జెర్సీ’కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ తో పాటు పంకజ్ కపూర్ కీలక పాత్రలో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో అమన్ గిల్, దిల్ రాజు, ఎస్ నాగ వంశీ ‘జెర్సీ’ని సంయుక్తంగా నిర్మించారు.