‘జీరో’ బోల్తా పడిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. ఇప్పుడు తిరిగి జోరు పెంచాడు. ఒకదాని తర్వాత మరొక సినిమాల్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను చేస్తున్న మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. ఇవే కాదు.. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘టైగర్ 3’లోనూ షారుఖ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడు. అయితే, దీనిపై అధికార ప్రకటన ఎప్పుడూ రాలేదు. కేవలం ప్రచారం మాత్రమే జరుగుతోంది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆ ప్రచారం నిజమేనని షారుఖ్ కన్ఫమ్ చేశాడు.
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 30 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. షారుఖ్ ఇన్ స్టాగ్రామ్ మాధ్యమంగా తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే టైగర్ 3 కేమియో గురించి ఒకరు ప్రశ్నించగా.. ‘అవును, తాను ఆ యాక్షన్ ఎంటర్టైనర్ లో కేమియో రోల్ చేస్తున్నాను’ అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో, సుదీర్ఘకాల మిస్టరీ వీడినట్టయ్యింది. ఇది ఇరువురి అభిమానులకు పండగలాంటి వార్తే. అన్నట్టు.. పఠాన్ లోనూ సల్మాన్ ఓ అతిథి పాత్రలో మెరువనున్న సంగతి తెలిసిందే. స్పై యూనివర్శ్ లో భాగంగా యశ్ రాజ్ సంస్థ ఆ ఇద్దరు హీరోలతో ఇలా కేమియో చేయిస్తోంది. ఇదే ఇంటరాక్షన్ సమయంలో షారుఖ్ మరో గోల్డెన్ న్యూస్ కూడా చెప్పాడు.
తన ‘పఠాన్’ చిత్రీకరణ కూడా ముగిసిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని షారుఖ్ వెల్లడించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొంత గ్యాప్ తర్వాత షారుఖ్ నుంచి సినిమా వస్తుండటం, పైగా స్పై నేపథ్యంలో రూపొందుతుండటంతో.. ‘పఠాన్’పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి, ఈ చిత్రంతో షారుఖ్ కంబ్యాక్ ఇస్తాడా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!