వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ప్రముఖ సింగర్ షాన్. ఇప్పుడు ఆయన పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం కోసం నటుడిగా మారారు. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా స్టూడియోలో ఓ పాట పాడిన ఈ సింగర్‌ను చూసి, పాత్రకు సరిపోతాడని భావించి తమ సినిమాలో నటించాలని చిత్ర దర్శక నిర్మాతలు కోరారు.
శర్మన్ జోషి, శ్రియా శరన్ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియ మాజీ ప్రేమికుడుగా షాన్ కనిపించ బోతున్నారు. షాన్ ఈ సినిమాలో నటించడంతో పాటు సినిమాలో పాట పాడటం విశేషం. సృజనాత్మకమైన కళలలో రెండు రకాలైన పాత్రలను పోషించడానికి, ‘నో’ చెప్పలేకపోయానని షాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘మ్యూజిక్ స్కూల్’లో భాగం కావడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. ఈ సినిమాలో పాట పాడటమే కాదు, నటుడిగా కనిపిస్తాను. నటించడం నాకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. సినిమాలోని ప్రధానాంశం నాకు వ్యక్తిగతంగా ఎంతగానో నచ్చింది’’ అని అన్నారు.
‘మ్యూజిక్ స్కూల్’ సినిమాను యామిని ఫిలింస్ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తోంది. బ్రాడ్ వే కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, వినయ్ వర్మ, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో 12 పాటలుంటాయి. మూస పద్ధతిలో ఉంటూ ఎలాంటి క్రియేటివిటీ లేని నేటి విద్యావ్యవస్థలో పిల్లలు తెలియని ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యం.