Shaakuntalam: ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న దృశ్య కావ్యం ‘శాకుంతలం’. సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే… ఈ సినిమాకు సంబంధించిన రీ-రికార్డింగ్ ను హంగేరీలోని బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాలో చేస్తున్నారు. కన్నుల పండవగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాకు వీనుల విందైన నేపథ్య సంగీతాన్నిఅందించే పనిలో ఉన్నారు సంగీత దర్శకుడు మణిశర్మ. వీరిద్దరి ఆలోచన మేరకు నేపథ్య సంగీతానికి బుడాపెస్ట్ లోని సింఫనీ ఆర్కెస్ట్రా సాయం తీసుకున్నారు. గుణశేఖర్ గతంలోనూ తన సినిమాలకు నేపథ్య సంగీతాన్ని హంగేరిలోనే చేయించుకున్నారు.
డా.ఎం.మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రలను పోషించిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది. త్రీడీలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చుతున్నారు.