సావిత్రి అన్న పేరుకు తెలుగునాట విశేషమైన గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పలుకు నేర్చిన తొలి రోజుల్లోనే ‘సతీ సావిత్రి’ పేరు మీద రెండు సినిమాలు జనం ముందు నిలిచాయి. తరువాత మరో 24 ఏళ్ళకు కడారు నాగభూషణం దర్శకత్వంలో ‘సతీ సావిత్రి’ తెరకెక్కింది. ఆ తరువాత యన్టీఆర్ యమధర్మరాజుగా నటించిన ‘సతీసావిత్రి’ 1978లో వెలుగు చూసింది. ఇలా పలుమార్లు సతీసావిత్రి కథ తెలుగువారిని పలకరించింది. 1957 జనవరి 12న విడుదలైన ‘సతీ సావిత్రి’లో యస్.వరలక్ష్మి సావిత్రిగా, యస్.వి.రంగారావు యమధర్మరాజుగా, ఏయన్నార్ సత్యవంతునిగా నటించారు. ఈ సినిమా విడుదలకు ఓ రోజు ముందే అక్కినేని, సావిత్రి నటించిన ‘తోడికోడళ్ళు’ జనం ముందు నిలచింది. ఇలా ఒక్కరోజు గ్యాప్ తో ఏయన్నార్ నటించిన రెండు సినిమాలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అక్షరాలా 65 ఏళ్ళు పూర్తయ్యాయి. ‘తోడికోడళ్ళు’ తమిళంలో ‘ఎంగల్ వీట్టు మహాలక్ష్మి’గా రూపొందింది. ఈ ‘సతీ సావిత్రి’ని తమిళంలో ‘సతియవాన్ సావిత్రి’ పేరుతో అనువదించారు.
‘సతీసావిత్రి’ కథ అందరికీ తెలిసిందే. పతిభక్తి గల సావిత్రి తన భర్త సత్యవంతుని ప్రాణాలను దక్కించుకున్న తీరును ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. పతిప్రాణం దక్క ఏమైనా కోరుకోమని సెలవిస్తాడు యమధర్మరాజు. అయినా, తన పాతివ్రత్య బలంతో మాటచాతుర్యంతో యముడినే తికమక పెట్టి, సావిత్రి తన పతిప్రాణాలను దక్కించుకుంటుంది. ఈ కథతోనే 1933లో సి.పుల్లయ్య ఓ ‘సతీసావిత్రి’ని తెరకెక్కించగా, హెచ్.ఎమ్.రెడ్డి అదే సంవత్సరం కొన్ని రోజుల గ్యాప్ లోనే మరో ‘సతీసావిత్రి’ని జనం ముందు నిలిపారు. పుల్లయ్య ‘సతీ సావిత్రి’లో రామతిలకం సావిత్రిగానూ, వేమూరి గగ్గయ్య యమధర్మరాజుగానూ అభినయించారు. హెచ్.ఎమ్.రెడ్డి ‘సతీసావిత్రి’లో వి.వి.సుబ్బారావు, కాంతకుమారి వంటివారు నటించారు. సి.పుల్లయ్య చిత్రమే మంచి విజయం సాధించింది. అప్పట్లో తెలుగునేలపై ‘సతీ సావిత్రి’ నాటకం విశేషంగా ప్రదర్శితమయ్యేది. అదే కథను కడారు నాగభూషణం 1957లో తెరకెక్కించారు. ఈ సినిమాలోని పద్యాలు, పాటలు అలరించాయి. అయితే ‘తోడికోడళ్ళు’ దాటికి ఈ చిత్రం నిలువలేక పోయింది. ఇందులో యస్వీరంగారావు యమధర్మరాజుగా, వేమూరి గగ్గయ్యనే మరిపించారనే పేరు సంపాదించారు. సావిత్రి పాత్రలో యస్.వరలక్ష్మి అభినయం ఆకట్టుకుంది.
రేలంగి, చిత్తూరు వి.నాగయ్య, కాంతారావు, సూరిబాబు, అల్లు రామలింగయ్య, డాక్టర్ శివరామకృష్ణయ్య, ఋష్యేంద్రమణి, సూర్యకాంతం, సూర్యకళ తదితరులు ఇందులో నటించారు. ఈ చిత్రానికి రావూరు వెంకటసత్యనారాయణ సంభాషణలు పలికించారు. దైతా గోపాలం, బి.వి.యస్.ఆచార్య, రావూరి పాటలు రాశారు. ఎస్వీ వెంకటరామన్ స్వరకల్పన చేసిన ఈ చిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ కొన్ని పాటలు పాడడం విశేషం. ఇందులో బాలమురళీకృష్ణ పాడిన “నారాయణతే నమో నమో…” పాట మంచి ఆదరణ పొందింది. యస్.వరలక్ష్మి స్వయంగా పాడిన “పోవుచున్నాడే… యమధర్మరాజు…”, “అమ్మా కావవే… అమ్మా…”, “మాటా ఇదేనా…” వంటి పాటలు అలరించాయి.
1933లో తొలి ‘సతీసావిత్రి’ తెరకెక్కించిన సి.పుల్లయ్య 1960లో యన్టీఆర్ తో ‘దేవాంతకుడు’ అనే సోషియో ఫాంటసీ తెరకెక్కించారు. ఆ చిత్రంలో యమధర్మరాజుగా యస్వీరంగారావును నటింప చేయడం విశేషం! యన్టీఆర్ తమ సొంత చిత్రం ‘ఉమ్మడి కుటుంబం’లో సతీసావిత్రి నాటకాన్ని సందర్భోచితంగా రూపొందించారు. అందులో యన్టీఆర్ యమధర్మరాజుగా, వాణిశ్రీ సతీసావిత్రిగా కనిపిస్తారు. అందువల్ల యన్టీఆర్ తో ‘లవకుశ’ వంటి ఎవర్ గ్రీన్ హిట్ నిర్మించిన ఎ.శంకర్ రెడ్డి వారిద్దరితోనే 1978లో ‘సతీ సావిత్రి’ తెరకెక్కించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు సత్యవంతుడు. ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది.