Jagadeesh Prathap Bandari: తెలంగాణ నేపథ్యంలో చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. అందులో కొన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో తమ సత్తా చాటుతున్నాయి. తాజాగా సిరిసిల్ల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘బలగం’ థియేటర్లలో హల్చల్ చేస్తుంటే… సంగారెడ్డి జిల్లా కొల్లూరు నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘సత్తిగాని రెండెకరాలు’ ఈ నెల 17 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే… ‘బలగం’ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించగా, ఈ ‘సత్తిగాని రెండెకరాలు’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. అలానే కరీంనగర్ నేపథ్యంలో సూర్యదేవర నాగవంశీ తీసిన ‘ఇంటింటి రామాయణం’ మూవీ సైతం విడుదలకు సిద్ధం అవుతోంది.
ఇక ‘సత్తిగాని రెండెకరాలు’ మూవీ విషయానికి వస్తే.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఆటో నడుపుకునే సత్తిగాడి జీవితం ఓ యాక్సిడెంట్ కారణంగా అల్లకల్లోలమౌతుంది. ఉన్న ఆటోను అమ్ముకోవడమే కాదు… రెండెకరాల భూమిని సైతం బేరానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఊహించని సమస్యలు ఒకవైపు… వాటిని ఆసరాగా చేసుకుని అతని జీవితంతో ఆడుకునే మనుషులు మరోవైపు. ఈ జీవన్మరణ సమస్యల నడుమ సత్తిగాడు ఏం చేశాడు? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? అన్నదే ‘సత్తిగాని రెండెకరాలు’ చిత్రం. ‘పుష్ప’ సినిమాతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న జగదీశ్ ప్రతాప్ బండారి ఇందులో టైటిల్ రోల్ పోషించగా, ఇతర ప్రధాన పాత్రలను ‘వెన్నెల’ కిశోర్, బిత్తిరి సత్తి, మోహన శ్రీ సురాగ, రాజ్ తిరందాసు, అనీషా దామ పోషించారు. ఈ మూవీని అభినవ్ దండా తెరకెక్కించాడు.
నిర్మాతల్లో ఒకరైన వై. రవిశంకర్ మూవీ గురించి మాట్లాడుతూ, ”మాకెంతో బాగా నచ్చిన స్క్రిప్ట్ ఇది. అందుకే పేషన్ తో దీన్ని నిర్మించాం. ప్రేక్షకులు భిన్నమైన, సరికొత్త అనుభూతులను అందించాలన్నదే నిర్మాతలుగా మా కోరిక. ఆహాతో కలిసి ఈ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకెళ్ళడం ఆనందంగా ఉంది” అని అన్నారు. దర్శకుడు అభినవ్ మాట్లాడుతూ, ”నా మనసుకు ఎంతో దగ్గరైన కథ ఇది. దీన్ని సినిమాగా రూపొందించడమనేది నా వరకూ ఓ ఛాలెంజ్. జీవితం విలువ గురించి, కష్టకాలంలో మనుషుల మనస్తత్వంలో వచ్చే మార్పుల గురించి ఇందులోని పాత్ర ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేశాను” అని చెప్పారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే… ఇందులో పాత్రలు, వాటి స్వభావాలు సహజ సిద్థంగా ఉన్నాయి. ఊహకందని మలుపులతో కథ సాగిపోతుందనిపిస్తోంది. ఈ యేడాది ఇప్పటికే మూడు చిత్రాలను విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్ కు ‘సత్తిగాని రెండెకరాలు’ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.