సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షలుకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరును వేగవంతం చేసేశారు మేకర్స్. ఇప్పటికే చిత్ర బృందం ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7 శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నామని తెలిపారు. దీంతో అభిమానులు రచ్చ చేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పటికే ట్రైలర్ లో వింటేజ్ మహేష్ బాబును చూసి పండగ చేసుకుంటున్న అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ స్పీచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరోపక్క ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ పోస్టర్ లో కూడా గెస్ట్ ఎవరు అన్నది చెప్పకపోవడంతో అస్సలు గెస్ట్ లు ఎవరు రావడం లేదా..? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఫ్యాన్స్ రచ్చ చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.