రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదల అనంతరం చిత్రం యూనిట్ హైదరాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడింది. సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మూలమైన సరళ సోదరుడు మోహనరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా విడుదలకు ముందే దర్శకుడు వేణు ఊడుగుల తనను ‘విరాట పర్వం’ చూడమని చెప్పారని అన్నారు. అయితే వేణు బోలెడంత హోమ్ వర్క్ చేసి, తీస్తున్న ఈ మూవీని ముందుగా చూడటం తన కిష్టం లేకపోయిందని, అందుకే నిన్న రిలీజ్ అయిన తర్వాత చూశామని, తమకు నచ్చిందని తెలిపారు. అయితే కొన్ని అంశాలపై ఆయన తన మనసులోని భావాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ”మా నాన్నగారు కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న వ్యక్తి. కానీ నక్సలైట్లతో కలిసి పని చేసేంత కాదు. అయితే మా చెల్లి మాకు తెలియకుండానే స్టూడెంట్ యూనియన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంది. ఆ క్రమంలో తను విప్లవాన్ని ఇష్టపడింది, ప్రేమించింది. అందుకే ఉద్యమంలోకి మాకు చెప్పకుండా వెళ్ళింది. కానీ సినిమాలో ఆమె ఓ నక్సలైట్ నాయకుడిని, అతని రచనలను, కవిత్వాన్ని ఇష్టపడి అడివిలోకి వెళ్ళినట్టు చూపించారు. రెండింటికీ పెద్ద తేడా లేదనే నేను అనుకుంటున్నాను. తను విప్లవం కోసం వెళ్ళింది. విప్లవం కోసమే చనిపోయింది. విప్లవం వల్లనే చనిపోయింది అన్నది వాస్తవం. అక్కడున్న కొందరి పొరపాటు నిర్ణయం కారణంగా తాను చనిపోయింది” అని అన్నారు.
అలానే ఈ సినిమా విడుదలైన తర్వాత ఒకరు ఫోన్ చేసి ‘ఇందులోని క్లయిమాక్స్ వాస్తవానికి భిన్నంగా ఉందని, సరళను నక్సలైట్లు కాల్చిచంపినట్టుగా ఇందులో చూపించడం కరెక్ట్ కాదు కదా!’ అని నన్ను అడిగారు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మేం అక్కడ లేం. దర్శకుడు వేణు ఈ విషయమై ఎంతో సమాచారాన్ని సేకరించాడు. కాబట్టి అతను సరిగానే చూపించాడని మాకు అనిపించింది” అని అన్నారు. రానా పోషించిన పాత్రపై మాత్రం మోహహనరావు కొంత అభ్యంతరం వ్యక్తంచేశారు. సరళ మరణానికి కారణమైన శంకరన్నను ఇందులో పాజిటివ్ గా చూపించాని, తమ దృష్టిలో అతను విలన్’ అని అన్నారు. ఈ చిత్రంలోని సంగీతం చాలా బాగుందని తన భార్య ప్రశంసించిందని చెప్పారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేశ్ బాబు మాట్లాడుతూ, ”చరిత్రలో నిలిచిపోయేవి బ్లాక్ బస్టర్ మూవీస్ కాదని, జనాలకు గుర్తుండేవి ఆ యేడాదిలో వచ్చిన మంచి చిత్రాలేనని, ‘విరాట పర్వం’ కూడా అలాంటి సినిమానే’నని అన్నారు. తమ బ్యానర్ లో సైతం ఓ బయోపిక్ రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమాలో వెన్నెల పాత్రను పోషించిన తర్వాత తాను సరళ కుటుంబ సభ్యులను కలిశానని, ఒకవేళ ముందే వారిని కలిసి ఉంటే ఇంకా బాగుండేదని తనకు అనిపించిందని సాయిపల్లవి తెలిపింది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు వేణు ఊడుగుల ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు సురేశ్ బొబ్బిలి థ్యాంక్స్ చెప్పారు.