ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద అసలైన వినోదాల విందు భోజనం సిద్ధమవుతోంది, ఈసారి పండుగ బరిలో ఐదు సినిమాలు నిలుస్తుండగా, ఇప్పటికే విడుదలైన నాలుగు చిత్రాల ట్రైలర్లు చూస్తుంటే థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు నవ్వుల పంట ఖాయమనిపిస్తోంది. ముఖ్యంగా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు బాక్సాఫీస్ రేసులో హాట్ టాపిక్‌గా మారాయి. మాస్ మహారాజా రవితేజ, క్లాస్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ తాజాగా విడుదలై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేస్తోంది. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌లోనే దర్శకుడు కథను చెప్పేశాడు. ఇందులో రవితేజ భార్యగా డింపుల్ హయాతి, మాజీ ప్రేమికురాలిగా ఆషిక రంగనాథ్ కనిపిస్తున్నారు. పెళ్లి తర్వాత భార్యకు, మాజీ ప్రేమికురాలికి మధ్య నలిగిపోయే భర్త పాత్రలో రవితేజ తనదైన శైలిలో అదరగొట్టారు. వెన్నెల కిషోర్, సత్య, సునీల్ వంటి హేమాహేమీలు ఉండటంతో వినోదానికి లోటు లేదనిపిస్తోంది. ముఖ్యంగా కమెడియన్ సత్య.. బోయపాటి శ్రీను మరియు విజయ్ దేవరకొండలను ఇమిటేట్ చేస్తూ చేసిన కామెడీ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.
Also Read:The Raja Saab: గెట్ రెడీ రెబల్స్.. తెలంగాణ జీవో లోడింగ్.. డైనోసార్ కమింగ్
మరోపక్క టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి అనగానే గుర్తొచ్చే స్పీడ్ డైలాగులు, టైమింగ్ పంచ్‌లతో ట్రైలర్ నిండిపోయింది. ఒక ఊరి నేపథ్యంలో సాగే ప్రేమ కథ కావడంతో, గ్రామీణ వాతావరణం, అక్కడి వినోదం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతి రేసులో గ్లామర్, యాక్షన్ కంటే ఈసారి ‘హ్యూమర్’ (వినోదం) కే పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. రవితేజ అనుభవం, నవీన్ పోలిశెట్టి క్రేజ్ ఈ పండుగను బాక్సాఫీస్ వద్ద మరింత కలర్‌ఫుల్‌గా మార్చబోతున్నాయి. కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా మంచి ఆప్షన్స్ కానున్నాయి.