కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు మెహన్ జునేజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ రెండు భాగాల్లో రాఖీ భాయ్ గురించి ఎలివేషన్ ఇచ్చే ఇన్ఫార్మర్ నాగరాజుగా ఆయన నటన అద్భుతం.. ఈ సినిమా తర్వాత మోహన్ కూడా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈయన చెప్పిన డైలాగ్స్ మీమ్స్ రూపం లో కనిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా తరువాత మోహన్ కు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయితే ఈ సమయంలోనే ఆయన మృతిచెందడం ఎంతో బాధాకరం. మోహన్ మృతిపట్ల కన్నడ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ‘కెజిఎఫ్’ చిత్ర బృందం కూడా మోహన్ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.