Samantha: వైవాహిక జీవితంలోని ఒడిదుడుకుల కారణంగా స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ కాస్తంత గాడి తప్పి ఉండొచ్చు కానీ ఆమె సినీ ప్రయాణం మాత్రం ఢోకా లేకుండా ముందుకు సాగుతోంది. ఈ యేడాది ఇప్పటికే సమంత నటించిన ‘కె.ఆర్.కె.’ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం సమంత తెలుగులో చేస్తున్న మూడు పాన్ ఇండియా సినిమాలు.. బ్యాక్ టూ బ్యాక్ మూడు నెలల వ్యవధిలో జనం ముందుకు రాబోతున్నాయి, అదీ ఇదే యేడాదిలో.
‘దిల్’ రాజు సమర్పణలో గుణశేఖర్ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ‘శాకుంతలం’ మూవీ షూటింగ్ నిజానికి ఫిబ్రవరి మాసంలోనే పూర్తయ్యింది. అయితే ఈ పురాణకాలానికి చెందిన చిత్రానికి గ్రాఫిక్ వర్క్ చాలా ఉండటంతో దర్శకుడు గుణశేఖర్ ఆ పనిలో పడ్డారు. దీన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ నవంబర్ లో జనం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఒక్క పాట మినహా పూర్తి అయిన సమంత ‘యశోద’ సినిమాను అక్టోబర్ మూడోవారంలో విడుదల చేయాలని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హరి, హరీశ్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లోనూ వి.ఎఫ్.ఎక్స్. కు బాగానే చోటుందట. ప్రస్తుతం ఆ గ్రాఫిక్ పనులనే చిత్ర బృందం పూర్తి చేస్తోంది. ఈ మూవీని కూడా తెలుగులో పాటు నాలుగు భాషల్లో విడుదల చేస్తామని నిర్మాత చెబుతున్నారు.

ఇదిలా ఉంటే… విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా ప్రారంభం రోజునే విడుదల తేదీని చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ ప్రకటించారు. డిసెంబర్ 23న ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తామని దర్శకులు శివ నిర్వాణ తెలిపారు. అయితే… ఈ నెలలో విడుదలవుతున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ విజయం సాధిస్తే… ‘ఖుషీ’ని సైతం హిందీలో డబ్ చేసే ఆస్కారం ఉంది. ఆ రకంగా చూస్తే… సమంత నటిస్తున్న ‘యశోద’, ‘శాకుంతలం’, ‘ఖుషీ’ చిత్రాలు వరుసగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. అనుకోని అవాంతరాలు ఎదురై ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అయితే చెప్పలేం కానీ అనుకున్నట్టు జరిగితే ఈ యేడాది సమంత సినిమాలు ఏకంగా నాలుగు విడుదలవుతున్నట్టే!!