Rajamouli: శాంతి నివాసం అనే సీరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలయింది ఆయన సినీ కెరీర్. తండ్రి పెద్ద కథా రచయిత. అన్నలు మంచి ట్యాలెంటెడ్ మ్యూజిషియన్స్. వీరెవ్వరి పేరు ఆయన ఉపయోగించుకోలేదు. సీరియల్ తీసే సమయంలోనే షాట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం నిద్రాహారాలు మాని పనిచేసేవాడట. అప్పుడే పని రాక్షసుడు అని పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. సక్సెస్ కు కేరాఫ్ అడ్రెస్స్. తీసినవి 12 సినిమాలు.. అన్ని విజయ కేతనం ఎగురవేసినవే. ఈగతో మ్యాజి చేయాలన్నా.. బాహబలి తో పాన్ ఇండియా అని క్రియేట్ చేయాలన్నా ఆయనకే చెల్లింది. ఒక స్టార్ కొడుకును హీరోగా చేయాలన్నా.. ఒక కమెడియన్ ను స్టార్ గా మార్చాలన్నా రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే పని. ఇక రికార్డులు ఆయన వెనుక నడుస్తాయి. రివార్డులు.. అవార్డులు ఆయన కోసమే పుట్టాయి అని చెప్తాయి. ఇప్పటివరకు జక్కన్న ఖ్యాతి దేశాలు పాకింది.. ఇప్పుడు ప్రపంచం మొత్తం కొనియాడబడుతోంది. అది ఆయన మార్క్. రాజమౌళి ప్రతి సినిమా చివరన.. ఇది రాజమౌళి సినిమా అని మార్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి భారతీయుడు కాలర్ ఎత్తి చెప్తున్నాడు.. అవును రా.. ఇది రాజమౌళి సినిమా.
RRR: ఇక ఇక్కడి నుండి మరో లెక్క!
ఆర్ఆర్ఆర్.. ఇద్దరు స్టార్లు.. ఏనాడు ఒక అభిమాని అనుకోని కల. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూసిన ఒక కళాఖండం. మిగతా ఇండస్ట్రీలు టాలీవుడ్ అంటే ఇది అని చూపించిన సినిమా. అసలు ఇండియాకు ఆస్కార్ సాధ్యమా అని ఆలోచిస్తూ కూర్చోకుండా మనకి కాకపోతే ఇంకెవరికి వస్తుంది అని ధైర్యంతో నామినేషన్ వేసి ఎట్టకేలకు అనుకున్నది సాధించిన సత్తా జక్కన్నది. ఇండియా.. ఇండియా.. ఇండియా అని అమెరికాలోని ప్రతి ఒక్క పౌరుడు మన దేశాన్ని, మన దేశ జెండాను గౌరవిస్తున్నాడు అంటే దానికి కారణం రాజమౌళినే. ఉదయం ఆస్కార్ వచ్చిన దగ్గరనుంచి సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ఆర్ఆర్ఆర్.. రాజమౌళి.. అంటూ ప్రతి ఒక్కరు ఆయనకు అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. ప్రధాని నుంచి మాములు ప్రజల వరకు రాజమౌళిని ప్రశంసించని నోరు లేదు. ఇక ఆర్ఆర్ఆర్ టీమ్ సైతం జక్కన్న కు శుభాకాంక్షలు తెలిపింది. ఒక అరుదైన ఫోటోను షేర్ చేస్తూ.. ఇది రాజమౌళి సినిమా.. చరిత్ర సృష్టించబడింది.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఫొటోలో రాజమౌళి.. అగ్నికీలలను చూస్తూ ఠీవిగా నిలబడిన ఫోటో నెట్టింట దుమ్ము రేగుతోంది.