Oscar: దర్శక ధీరుడు రాజమౌళి తన కెరీర్ లో ఎప్పటి కప్పుడు ఓ ల్యాండ్ మార్క్ ను క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. ‘సింహాద్రి’ సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రకరకాల కారణాల వల్ల రకరకాల వ్యక్తుల చేతులు మారిన ‘సింహాద్రి’ మూవీని రాజమౌళి టేకప్ చేసినప్పుడు ఈ స్థాయి విజయాన్ని ఎవరూ ఊహించలేదు. కానీ ‘సింహాద్రి’ ఫేట్ నే రాజమౌళి తనదైన మ్యాజిక్ తో మార్చేశాడు. ఎన్టీయార్ మూవీస్ లో అదో ల్యాండ్ మార్క్ అయ్యింది. సినిమా ప్రారంభానికి, విడుదలకు మధ్య రకరకాల అవాంతరాలు ఎదురైనా… ఆ బ్యాడ్ ఇంపాక్ట్ ఏదీ ‘సింహాద్రి’ మీద పడకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకున్నాడు. అలానే ప్రభాస్ తో చేసిన ‘ఛత్రపతి’ మరో రికార్డ్! ఆ వెంటనే వచ్చిన ‘విక్రమార్కుడు’ మాస్ మహరాజా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రాజమౌళి తీసిన ‘మగధీర’ సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్రాఫికల్ వండర్ అనే దానికి ‘ఈగ’ మూవీ పర్యాయపదంగా మారిపోయింది. మేకింగ్ పరంగానే కాకుండా కలెక్షన్స్ పరంగానూ ‘బాహుబలి’ భారతీయ సినిమాల్లో ఓ పెద్ద విభజన రేఖను గీసేసింది. చాలా ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ‘నాన్ బాహుబలి’ రికార్డ్స్ అనేది ఓ కామన్ వర్డ్ గా మారిపోయింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో అలాంటి మరో ల్యాండ్ మార్క్ ను రాజమౌళి సృష్టించారు.
‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీ సాధించిన కమర్షియల్ సక్సెస్ ను పక్కన పెడితే… ఇంటర్నేషనల్ గా ఈ సినిమాకు వచ్చినన్ని ప్రతిష్ఠాత్మక అవార్డులు రాబోయే రోజుల్లో మరే తెలుగు సినిమాకు అయినా వస్తాయా? అన్నది సందేహమే! విదేశీ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడం, అక్కడ అవార్డులను అందుకోవడం భారతీయ చిత్రాలకు కొత్త కాదు. కానీ ఒక తెలుగు సినిమా, అదీ పూర్తి స్థాయిలో మన వాళ్ళు నిర్మించిన సినిమా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఆ క్రెడిట్ కూడా రాజమౌళికే దక్కడం గర్వకారణం. ఏడేళ్ళ క్రితం రాజమౌళికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చినప్పుడు కనుబొమ్మలను చిట్లించిన అందరికీ ఇవాళ సమాధానం దొరికి ఉంటుంది! ‘ఛత్రపతి’ సినిమాలో ప్రభాస్ తో చెప్పించినట్టుగా రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ మూవీతో ఆస్కార్ వేదికపై ఒక్క అడుగు… ఒకే ఒక్క అడుగు వేశాడు. ఈ తొలి అడుగు… ఎన్ని అడుగుల ప్రయాణానికి దారి తీస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే… రాజమౌళి తదుపరి చిత్రం ప్రిన్స్ మహేశ్ బాబుతో ఉండబోతోంది. కథానుగుణంగా దాన్ని అంతర్జాతీయ స్థాయిలోనే రాజమౌళి తెరకెక్కిస్తాడని అంటున్నారు. అదే నిజమైతే… ఈసారి రాజమౌళి ఆస్కార్ బరిలో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ కేటగిరీలనే టార్గెట్ చేస్తాడు. అందులో సందేహం లేదు… సో… ఇక్కడి వరకూ ఒక లెక్క… ఇక్కడి నుండి మరో లెక్క!