చదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు కశ్మీర్ లో నిర్మించిన మ్యూజికల్ లవ్ స్టొరీ ‘రోజ్ గార్డెన్’. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీజర్ ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, హీరో నితిన్ నాష్, దర్శకుడు రవికుమార్ పాల్గొన్నారు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కథా చిత్రంలో సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందనీ, సినిమాలోని అన్ని పాటలను ముంబై లో రికార్డ్ చేశామని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు.
సినిమాలోని ఒక పాటను ఎ.ఎం. రత్నం రాయడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘రోజ్ గార్డెన్’ చిత్రంలో తమిళ నటుడు, నిర్మాత త్యాగరాజన్ ప్రత్యేక పాత్ర పోషించారు. పోసాని, గౌతమ్ రాజు, ధనరాజ్ తో పాటు ముంబై కు చెందిన అశోక్ కుమార్ బెనివాల్, మిలింద్ గునాజీ, గౌహర్ ఖాన్, బబ్రక్ అక్బరి, సునీల్ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శంకర్ కంతేటి సినిమాటోగ్రఫీ అందించగా, కథ, మాటలు, దర్శకత్వంతో పాటు జి. రవికుమార్ సంగీతాన్ని అందించారు.