Rishab Shetty Reveals The First Choice Of Kantara: తన స్వీయ దర్శకత్వంలో హీరో రిషభ్ శెట్టి రూపొందించిన ‘కాంతార’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు! ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడేసుకుంటోంది. తొలుత కన్నడ వర్షన్‌లో సెప్టెంబర్ 30న రిలీజైన ఈ సినిమాకు విస్తృతమైన పాజిటివ్ రివ్యూలు రావడంతో.. మిగిలిన భాషల్లోనూ అక్టోబర్ 15న విడుదల చేశారు. భాషతో సంబంధం లేకుండా కథకి, కల్చర్‌కి ఆడియెన్స్ కనెక్ట్ కావడంతో.. ఇది కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూ, ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటోంది.
ఇదిలావుండగా.. తాజాగా ఈ సినిమా గురించి రిషభ్ శెట్టి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. హిందీలో ఓ ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అతను.. ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ తాను కాదని, ఓ కన్నడ స్టార్ హీరో అని బాంబ్ పేల్చాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్. నిజానికి.. పునీత్‌ని దృష్టిలో పెట్టుకొనే తాను ఈ కథని సిద్ధం చేశానని చెప్పాడు. స్క్రిప్ట్ పూర్తయ్యాక ఆయన్ను కలిసి, స్క్రిప్ట్ కూడా వినిపించానన్నాడు. అయితే.. పునీత్ అప్పటికే కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఈ సినిమా చేయలేనని చెప్పారని రిషభ్ తెలిపాడు.
అంతేకాదు.. ఈ కథ సహజత్వానికి దగ్గరగా ఉండాలంటే, మీరు నటిస్తేనే బాగుంటుందని పునీత్ తనకు చెప్పారని రిషభ్ పేర్కొన్నాడు. ‘ఈ సినిమాలో మీరే చేస్తేనే బాగుంటుంది. మీరే హీరోగా చేయండి’ అని పునీత్ తనని ఇన్సిస్ట్ చేశారన్నాడు. దాంతో.. తానే హీరోగా ఈ కాంతార సినిమా చేశానని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడం పట్ల అతడు సంతోషం వ్యక్తం చేశాడు.