సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం గత యేడాది అక్టోబర్ 1వ తేదీ జనం ముందుకు వచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ఆ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేశారు. భారత రాజకీయ వ్యవస్థతో ఓ ఐ.ఎ.ఎస్. అధికారి తలపడితే ఎలాంటి పర్యావసానం ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ప్రధానాంశంగా దేవ కట్టా ‘రిపబ్లిక్’ చిత్రం తెరకెక్కించాడు. అప్పటికి కొద్ది రోజుల ముందు మోటర్ బైక్ యాక్సిడెంట్ తో గాయాల పాలై చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయాడు. దాంతో ఆ బాధ్యతను కూడా తన భుజాలకెత్తుకుని మూవీని జనం ముందుకు తీసుకెళ్ళాడు దేవ కట్టా.
థియేటర్లలో ‘రిపబ్లిక్’కు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోయినా, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఆ మధ్య ఈ మూవీ జీ 5 ఓటీటీలో ప్రసారం అయినప్పుడు ఎక్కువ మంది దీనిని వీక్షించి, చిత్ర బృందాన్ని అభినందించారు. నిజానికి ఈ మూవీని పూర్తి స్థాయిలో సాయి ధరమ్ తేజ్ చూసింది కూడా జీ 5లో స్ట్రీమింగ్ అయినప్పుడే. ఇప్పుడీ సినిమాను జీ తెలుగు ఛానెల్ జనవరి 23వ తేదీ సాయంత్రం (ఆదివారం, 6.00లకు) ప్రసారం చేయబోతోంది. థియేటర్, ఓటీటీ మాధ్యమాలలో ‘రిపబ్లిక్’ను చూసి ఆదరించినట్టే… ఇప్పుడు జీ తెలుగు ఛానెల్ లోనూ ఈ సినిమాను చూసి, ఇందులో కంటెంట్ ను అర్థం చేసుకుని తమను అభినందిస్తారనే ఆశాభావాన్ని దేవ కట్టాతో పాటు, జీ తెలుగు బృందం వ్యక్తం చేస్తోంది.