బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కారు యాక్సిడెంట్ కు గురైంది. కొద్దిసేపటి క్రితం రణబీర్ ముంబై లోని తన ఇంటి నుంచి ‘షంషేరా’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వస్తుండగా మార్గమధ్యంలో తన కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో అతని కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే కారులో ఉన్న రణబీర్ కు గాయాలు ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . ఇక ఈ విషయాన్ని రణబీర్ స్వయంగా చెప్పడం విశేషం. రణబీర్ కపూర్ హీరోగా కారం మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘షంషేరా’. జూలై 22 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరును పెంచేశారు చిత్ర బృందం.
ఇక ప్రమోషన్లో భాగంగానే నేడు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వస్తుండగానే రణబీర్ కారుకు ప్రమాదం జరిగింది. ఇక దీని గురించి రణబీర్ మాట్లాడుతూ “క్షమించండి.. కొద్దిగా ఆలస్యం అయ్యింది. నిజానికి నేను కూడా కరెక్ట్ టైమ్ కు వద్దామనే బయల్దేరాను. మధ్యలో మా కారును ఒక వ్యక్తి ఢీకొట్టడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. నిజంగా విశేషం ఏంటంటే.. అందులోంచి మేము బయటపడ్డాం.. మాకు ఎటువంటి గాయాలు కాలేదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో మీడియా మిత్రులతో పాటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రణబీర్ కపూర్ తో పాటు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో రణబీర్ కపూర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.