దగ్గుబాటి రానా బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 14 ఉదయం ‘భీమ్లా నాయక్’ నుండి అతను నటిస్తున్న డేనియల్ శేఖర్ క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ను శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేసిన చిత్ర బృందం సాయంత్రం ఓ డైలాగ్ టీజర్ ను రిలీజ్ చేసింది. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించే ఈ ప్రచార చిత్రాన్ని చూస్తే, “వాడు అరిస్తే భయపడతానా, ఆడికన్నా గట్టిగా అరవగలను… ఎవడాడు!? దీనమ్మ దిగొచ్చాడా!? ఆఫ్ట్రాల్ ఎస్. ఐ., సస్పెండెడ్….” అంటూ డేనియల్ శేఖర్ పాత్రధారి రానా ఆవేశంగా చెప్పడం ఇందులో కనిపిస్తుంది. సస్పెండ్ అయిన ఎస్.ఐ.తో రానా కు ఉన్న పంచాయితీ ఏమిటీ అనేది తెలుసుకోవాలంటే జనవరి 12వరకూ వేచి చూడాల్సిందే.
మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ అయిన ‘భీమ్లా నాయక్’కు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. నిత్యా మీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళీ శర్మ, సముతిరకని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ ఎస్.ఎస్. సంగీతం అందించాడు.