హీరో రవితేజ పక్కన పెట్టేశాడంటూ ప్రచారంలో ఉన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఎట్టకేలకు ప్రమోషన్ మొదలైంది. శనివారం ఐటమ్ సాంగ్ సీసాను విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటకు శామ్ సి.ఎస్ సంగీతం అందిచారు. రవితేజ, అన్వేషా జైన్ పై చిత్రీకరించిన ఈ పాటను శ్రేయోఘోషల్ పాడారు. ‘ఒకరికి నే తేనె సీసా… ఒకరికి నేను కల్లు సీసా… ఒకరికి నే రసాల సీసా… అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా… ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా… మీసం పట్టుకోకుండా కౌగిలిస్తేస్తా… చెంతకు రాకుండా చెమటలు పట్టిస్తా… ఉన్న చోటనే ఉంటా మీలో ఊపు ఉడుకు పుట్టస్తా… నేను కాదు నా ఫోటో చాలు తీరుస్తుంది మీ ఆశ…. ఒకరికి నే నీటి సీసా… ఒకరికి నే సెంటు సీసా… ఒకరికి నే సోడా సీసా… ఇంకొకరికి నే సెలైను సీసా…’ అంటూ ఈ పాట సాగుతుంది.
చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ అయినా, థమన్ అయినా ఎలాంటి మాస్ బీట్ అందించి ఉండేవారో… అయితే శామ్ మాత్రం అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారనిపిస్తుంది. ఇక పలు మెలోడీస్, విషాద గీతాలు, పెప్పీ నంబర్స్ తో పాటు ‘చిక్నీ చమేలీ, ఊ లలల్లా’ వంటి ఐటమ్స్ తో దుమ్ము రేపిన శ్రేయా ఘోషల్ గళం కూడా మ్యాజిక్ చేయలేకపోయింది. ఇక ఐటమ్ గర్ల్ గా యాక్ట్ చేసిన అన్వేషి జైన్ లో ఏ మాత్రం హుషారు కనిపించలేదు. పాటల్లో రెచ్చిపోయే రవితేజ కూడా డల్ గా కనిపించాడు. చంద్రబోస్ లిరిక్ తో రెచ్చిపోయినా పేలవమైన ట్యూన్ కావటం వల్లో ఏమో కానీ పాటలో ఊపు లేకపోయింది. డాన్స్ మాస్టర్ శేఖర్ కూడా చిందేసే మూమెంట్స్ కంపోజ్ చేయలేకపోయాడు. మరి ఐటమ్ తో నిరాశ పరిచిన ‘రామారావు అన్ డ్యూటీ’ మిగిలిన పాటలతో ఆకట్టుకుంటాడేమో చూద్దాం.