Rahul Vijay: సినిమా రంగంలో కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి. ఇప్పుడిప్పుడుకే కెరీర్ ప్రారంభించిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళు… ఒకే యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న సంఘటన ఒకటి టాలీవుడ్ లో జరిగింది. ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళ అబ్బాయి రాహుల్ నాలుగేళ్ళ క్రితం ‘ఈ మాయ పేరేమిటో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికి మూడు, నాలుగు సినిమాలతో పాటు ‘కుడి ఎడమైతే’ అనే వెబ్ సీరిస్ లోనూ నటించాడు. అతని తాజా చిత్రం ‘పంచతంత్రం’ శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఐదు కథల సమాహారంగా తెరకెక్కిన ఈ మూవీలోని ఓ కథలో రాహుల్ విజయ్ తో పాటు డా. రాజశేఖర్, జీవిత రెండో కుమార్తె శివాత్మిక జోడీ కట్టింది. మూడేళ్ళ క్రితం ‘దొరసాని’ మూవీతో ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కాస్తంత గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా ‘పంచతంత్రం’. విశేషం ఏమంటే… రాహుల్ విజయ్ శివాత్మకతోనే కాదు… ఆమె అక్క శివానీ రాజశేఖర్ తోనూ ఓ సినిమాలో జంటగా నటించాడు. అదే ‘విద్య వాసుల అహం’. ఈ సినిమా జనవరి 14వ తేదీ సంక్రాంతి కానుకగా జనం ముందుకు రాబోతోంది. సో… అక్కా చెల్లెళ్ళు ఇద్దరితో రెండు వేర్వేరు సినిమాలలో రాహుల్ విజయ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే, అవి బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి.