మాటను పట్టుకొని సినిమా బాట పట్టినవారు ఎందరో ఉన్నారు. వారిలో కొందరే విజయం సాధించారు. కొందరు మాటలు పలికించడంతో పాటు, తెరపైనా గిలిగింతలు పెట్టారు. వారిలో రావి కొండలరావు సైతం స్థానం సంపాదించారు. రచయితగా, జర్నలిస్టుగా, నాటకరచయితగా ఇలా సాగిన తరువాతే చిత్రసీమ బాటపట్టారు రావి కొండలరావు. తరువాత చిత్రసీమలోనూ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి అలరించారాయన.
రావి కొండలరావు తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో 1932 ఫిబ్రవరి 11న జన్మించారు. రావి కొండలరావు తండ్రి శ్రీకాకుళంలో పోస్ట్ మాస్టర్ గా పనిచేసేవారు. అందువల్ల కొండలరావు చదువు కూడా అక్కడే సాగింది. చదువుకొనే రోజుల్లోనే పన్నెండేళ్ల వయసులో ఆయన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అప్పట్లో ఆర్.ఎస్.ఎస్.; హిందూ మహాసమ్మేళన్ పై నిషేధం విధించారు. దానిని నిరసిస్తూ సత్యాగ్రహం సాగింది. ఈ నేపథ్యంలోనే కొండలరావు కూడా పాల్గొని, రాజమండ్రి జైలుకు వెళ్ళారు. దాదాపు మూడు నెలలు జైలులో ఉన్నారు. ఆ సమయంలోనే అనేక పుస్తకాలు చదివారు. అప్పుడే ‘మన మూహలు’ అనే పేరుతో కొన్ని కథలు రాశారు. వాటిలో కొన్ని ‘చందమామ’ పత్రికలో ప్రచురితమయ్యాయి. ‘చందమామ’ ఎడిటర్ కొడవంటి కుటుంబరావు స్ఫూర్తితో కథలు రాశారు. తరువాత ముళ్ళపూడి వెంకటరమణ కూడా ఆయనను ప్రోత్సహించారు. ముళ్ళపూడి కథతో తెరకెక్కిన యన్టీఆర్ ‘దాగుడుమూతలు’ చిత్రంతో తెరకు పరిచయం అయ్యారు రావి కొండలరావు. తరువాత బి.యన్.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు వంటి వారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశారు.
రావి కొండలరావు, రాధాకుమారి నాటకాలు వేస్తూ ఉండేవారు. వారు ప్రేమించి పెళ్ళాడారు. వారిద్దరూ అనేక చిత్రాలలో భార్యాభర్తలుగానే కనిపించారు. ఆయన నటించిన చాలా చిత్రాలలో తన పాత్రలకు తానే రచన చేసుకొనేవారు. అదే ఆయనకు అవకాశాలు కల్పించిందనీ చెప్పవచ్చు. రచయితలు సైతం రావి కొండలరావును ప్రోత్సహించారు. బాపు-రమణ తమ చిత్రాలలో ఆయనకు ఏదో ఒక పాత్ర ఇస్తూ వచ్చారు. అలాగే విజయా, యన్.ఏ.టి., అన్నపూర్ణ సంస్థలు నిర్మించన పలు చిత్రాల్లోనూ రావి కొండలరావు నటించారు. బి.నాగిరెడ్డి, చక్రపాణి నిర్వహిస్తున్న “చందమామ, విజయచిత్ర” పత్రికల్లో ఆయన రచనలు చేసేవారు. తరువాతి రోజుల్లో ఎడిటర్ విశ్వంకు ఆయన సలహాలు, సూచనలు ఇస్తూ సాగారు. విజయా సంస్థాధినేతలతో రావి కొండలరావుకు ఉన్న అనుబంధం తరువాతి రోజుల్లో వారి వారసులు నిర్మించిన “బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం” వంటి చిత్రాల రచనలో పాలు పంచుకొనేలా చేసింది. అలాగే సదరు చిత్రాలకు ఆయన సంచాలకునిగానూ వ్యవహరించారు. హైదరాబాద్ లో ఉంటూ పలు పుస్తకాలు వెలుగులోకి తెచ్చారు. 2020 జూలై 28న ఆయన కన్నుమూశారు. ఈ నాటికీ ఆయన రచన చేసిన సినిమా పుస్తకాలను అభిమానులు ఆసక్తిగా చదువుతూనే ఉండడం విశేషం!